LOADING...
IPL 2026: ఐపీఎల్‌ మినీ వేలంలో బిగ్ ట్విస్ట్‌.. ఫ్రాంచైజీల వ్యూహాన్ని మార్చే రెండు నిబంధనలు ఇవే
ఐపీఎల్‌ మినీ వేలంలో బిగ్ ట్విస్ట్‌.. ఫ్రాంచైజీల వ్యూహాన్ని మార్చే రెండు నిబంధనలు ఇవే

IPL 2026: ఐపీఎల్‌ మినీ వేలంలో బిగ్ ట్విస్ట్‌.. ఫ్రాంచైజీల వ్యూహాన్ని మార్చే రెండు నిబంధనలు ఇవే

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 మినీ వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామెరూన్‌ గ్రీన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉండటంతో ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠభరిత వేలం ప్రక్రియలో చాలా మందికి పూర్తిగా తెలియని రెండు కీలక నిబంధనలు ఉన్నాయి. అవే 'సైలెంట్‌ టై బ్రేకర్‌', 'యాక్సిలరేటెడ్‌ రౌండ్‌'. ఈ రెండు నియమాలు అర్థమైతేనే ఐపీఎల్‌ వేలం వెనుక ఉన్న అసలు వ్యూహం స్పష్టమవుతుంది.

Details

సైలెంట్‌ టై బ్రేకర్‌ అంటే?

ఐపీఎల్‌ వేలంలో అత్యంత ఆసక్తికరమైన, నాటకీయమైన నిబంధన ఇది. ఒకే ఆటగాడిని కొనుగోలు చేయడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫ్రాంచైజీలు తమ పర్సులో ఉన్న మొత్తం మొత్తాన్ని బిడ్‌ చేసి సమాన స్థితిలో నిలిచినప్పుడు ఈ నియమం అమల్లోకి వస్తుంది. ఈ పరిస్థితిలో సంబంధిత ఫ్రాంచైజీలు సీల్డ్‌ కవర్‌లో రహస్యంగా ఒక మొత్తాన్ని రాసి బీసీసీఐకి సమర్పించాలి. ఎవరు ఎక్కువ మొత్తాన్ని రాస్తారో ఆ జట్టుకే ఆ ఆటగాడు దక్కుతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. సీల్డ్‌ కవర్‌లో రాసిన అదనపు మొత్తం ఆటగాడి జీతంలోకి వెళ్లదు. అది నేరుగా బీసీసీఐ ఖాతాలోకే చేరుతుంది.

Details

ఆటగాడికి రూ.18 కోట్లు మాత్రమే

ఉదాహరణకు ఒక ఆటగాడిపై రెండు జట్లు రూ.18 కోట్లతో సమానంగా నిలిస్తే, ఒక జట్టు రూ.22 కోట్లు, మరో జట్టు రూ.23 కోట్లు సీల్డ్‌ కవర్‌లో రాశాయనుకుందాం. అప్పుడు రూ.23 కోట్లు రాసిన జట్టుకు ఆటగాడు దక్కుతాడు. అయితే అతడికి అందే జీతం మాత్రం రూ.18 కోట్లే. మిగిలిన రూ.5 కోట్లు బీసీసీఐకి వెళ్తాయి. ఈ విధానంతోనే 2010లో కీరన్‌ పోలార్డ్‌, షేన్‌ బాండ్‌, 2012లో రవీంద్ర జడేజా వంటి స్టార్‌ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి.

Advertisement

Details

యాక్సిలరేటెడ్‌ రౌండ్

ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో తొలి దశలో 70 మంది ఆటగాళ్ల బిడ్డింగ్‌ పూర్తయ్యాక 'యాక్సిలరేటెడ్‌ రౌండ్‌' ప్రారంభమవుతుంది. తొలి రౌండ్‌లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా నుంచి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిన కొందరిని మళ్లీ వేలంలోకి తీసుకువస్తారు. ఈ దశలోనే చాలా జట్లు తక్కువ ధరకు మ్యాచ్‌ విన్నర్లను దక్కించుకుని తమ జట్లను బలోపేతం చేసుకుంటాయి. అందుకే ఈ రౌండ్‌ ఫ్రాంచైజీల వ్యూహాత్మక ఆలోచనలకు అసలైన పరీక్షగా నిలుస్తుంది. మొత్తంగా 'సైలెంట్‌ టై బ్రేకర్‌', 'యాక్సిలరేటెడ్‌ రౌండ్‌' వంటి నిబంధనలు ఐపీఎల్‌ వేలాన్ని కేవలం బిడ్డింగ్‌ ప్రక్రియగా కాకుండా, వ్యూహాలు-సాహస నిర్ణయాలతో నిండిన ఉత్కంఠభరిత క్రీడగా మార్చుతున్నాయి.

Advertisement