LOADING...
IND vs SA: ఇటు బౌలర్లు-అటు బ్యాటర్లు ఫెయిల్‌.. సఫారీల చేతిలో టీమిండియా పరాజయం 
ఇటు బౌలర్లు-అటు బ్యాటర్లు ఫెయిల్‌.. సఫారీల చేతిలో టీమిండియా పరాజయం

IND vs SA: ఇటు బౌలర్లు-అటు బ్యాటర్లు ఫెయిల్‌.. సఫారీల చేతిలో టీమిండియా పరాజయం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

రెండో టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో తడబాటుకు గురైంది. బౌలింగ్‌లోనే కాదు, ఛేదనలోనూ అదే నిర్లక్ష్యం కొనసాగడంతో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్వింటన్‌ డికాక్‌ (90; 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) దూకుడుతో సఫారీ జట్టు 4 వికెట్లకు 213 పరుగులు చేయగా... భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌, బుమ్రా అధికంగా పరుగులు ఇచ్చి నిరాశపరిచారు. వరుణ్‌ చక్రవర్తి (2/29) మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మెచ్చుకున్నారు.

Details

ఛేదనలోనే కుప్పకూలిన భారత్‌ 

పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలంటే బలమైన ఆరంభం తప్పనిసరి. అయితే భారత్‌ మొదటి 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్‌కు దూరమైంది. గత మ్యాచ్‌ నుంచి ఉన్న విమర్శల మధ్య గిల్‌ ఖాతా తెరవకుండానే ఎంగిడి బౌలింగ్‌లో తొలి ఓవర్లోనే పెవిలియన్‌ చేరాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (5) కూడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ యాన్సెన్‌ బౌలింగ్‌కు బలి అయ్యాడు. యాన్సెన్‌ తన మొదటి ఓవర్లోనే అభిషేక్‌ శర్మను (17) ఔట్ చేసి టీమ్‌ఇండియాను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.

Details

రాణించిన తిలక్ వర్మ

ఈ కష్టసమయంలో తిలక్‌ వర్మ (62; 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతనికి అక్షర్‌ పటేల్‌ (21; 21 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) తోడయ్యాడు. అక్షర్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపిన నిర్ణయం ఉపయోగపడుతుందనిపించినా... అతడు రన్‌ వేగం పెంచలేక పోయాడు. చివరికి ఒక సిక్స్‌తో ఊపు తెచ్చుకునే ప్రయత్నం చేసినా వెంటనే ఔట్‌ అయ్యాడు.

Advertisement

Details

విఫలమైన టీమిండియా బ్యాటర్లు

తదుపరి హార్దిక్‌ పాండ్యా (20; 23 బంతుల్లో 1 సిక్స్‌)తో కలిసి తిలక్‌ స్కోరు పెంచినా, రన్‌రేట్‌ బాగా ఎగబాకడంతో ఇద్దరి ఇన్నింగ్స్‌ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. హార్దిక్‌ ఔట్‌ అయ్యే సమయానికి స్కోరు 118/4. ఇక అక్కడి నుంచి ఆఖరి ఐదు ఓవర్లలో 91 పరుగులు చేయడం అసాధ్యమైపోయింది. తిలక్‌, జితేశ్‌ శర్మ (27; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొంత ప్రతిఘటించినా... అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. 18వ ఓవర్‌ వరకు 157/5గా ఉన్న భారత్‌... ఐదు పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు కోల్పోయి 51 పరుగుల తేడాతో పరాజయం పొందింది. తిలక్‌ చివరి వికెట్‌గా ఔటయ్యాడు.

Advertisement

Details

డికాక్‌ దుమ్మురేపిన ఇన్నింగ్స్‌ 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అసలు ఆకర్షణ డికాక్‌ ప్రదర్శన. తొలి మ్యాచ్‌లో విఫలమైన అతడు ఈసారి ప్రారంభం నుంచి దూకుడే ప్రదర్శించాడు. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్‌ని సిక్స్‌తో ఎదుర్కొని తన అగ్రెషన్‌ను చూపించాడు. స్క్వేర్‌ లెగ్‌ ప్రాంతాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఏడు సిక్స్‌లు బాదాడు. హెండ్రిక్స్‌ (8) త్వరగా ఔట్‌ అయినా మార్‌క్రమ్‌ (29) అండగా నిలవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి 53/1తో నిలిచింది సఫారీ జట్టు. బుమ్రా మొదటి ఓవర్లో కేవలం 1 పరుగే ఇచ్చినా... రెండో ఓవర్లో 16 పరుగులు ఇవ్వడం టోన్‌ మార్చింది. 26 బంతుల్లోనే డికాక్‌ అర్ధశతకం పూర్తి చేయడం అతడి దూకుడుకు నిదర్శనం.

Details

చివర్లో రాణించిన ఫెరీరా, డేవిడ్ మిల్లర్

ఓదార్పు ఇచ్చిన వరుణ్‌ తన ఓవర్లో మార్‌క్రమ్‌ను రెండు సిక్స్‌లు బాదిన తర్వాత ఔట్‌ చేయడం జరిగింది. అయితే డికాక్‌ ఆగకుండా 150 మార్క్‌ దాటించాడు. శతకం దిశగా వెళ్తున్న వేళ 16వ ఓవర్లో వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మ అద్భుత రనౌట్‌తో అతడి ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ వేశారు. తరువాత భారత్‌ రెండు ఓవర్లలో నాలుగు, నాలుగు పరుగులే ఇవ్వడం వల్ల స్కోరింగ్‌ రేట్‌ తగ్గినట్లు అనిపించినా... చివరి మూడు ఓవర్లలో డొనోవన్‌ ఫెరీరా (30 నాటౌట్‌; 16 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), డేవిడ్‌ మిల్లర్‌ (20 నాటౌట్‌; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 49 పరుగులు బాదారు.

Details

అర్ష్‌దీప్‌ పేలవ ప్రదర్శన - ఏకంగా తొమ్మిది వైడ్లు 

ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తం 4 ఓవర్లలో 54 పరుగులు ఇవ్వగా ఎకానమీ రేట్‌ 13.50 నమోదైంది. కేవలం 11వ ఓవర్‌లోనే 7 వైడ్లు వేయడం గమనార్హం. ఈ ఎక్స్‌ట్రాలు దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడానికి ప్రధాన కారణమయ్యాయి. ఇక రెండు జట్లు మధ్య మూడో టీ20 మ్యాచ్‌ ఆదివారం ధర్మశాలలో జరగనుంది. భారత్‌ సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచులో తప్పక గెలవాల్సిందే.

Advertisement