LOADING...
Najmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం: బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు
బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు

Najmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం: బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB),ఆ దేశ ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2026 టీ20 ప్రపంచకప్ వేదికల అంశంపై ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐలతో భేదాభిప్రాయాలు ఎదుర్కొంటున్న బంగ్లా క్రికెట్ బోర్డుకు, ఇప్పుడు స్వదేశీ ఆటగాళ్ల నుంచే భారీ సవాలు ఎదురవుతోంది. బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన వెంటనే పదవిని వదిలివేయాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరంగా ఉంటామని ఆటగాళ్లు తేల్చి చెప్పారు. ఇటీవల ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడం,అలాగే వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లడంపై ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందించాడు.

వివరాలు 

తమీమ్ ఇక్బాల్‌ను 'ఇండియన్ ఏజెంట్' అని సంబోధించిన బోర్డు అధికారి 

భావోద్వేగాలకు లోనవకుండా పరస్పర చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించాడు. అయితే ఈ వ్యాఖ్యలు బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాంను ఆగ్రహానికి గురిచేశాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన తమీమ్ ఇక్బాల్‌ను 'ఇండియన్ ఏజెంట్'గా సంబోధించడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు ఆటగాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని క్రికెటర్ల సంక్షేమ సంఘం (సీడబ్ల్యూఏబీ) తీవ్రంగా ఖండించింది. నజ్ముల్ ఇస్లాం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆటగాళ్లు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) మ్యాచ్‌లతో పాటు అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనబోమని స్పష్టం చేశారు.

వివరాలు 

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పొంచి ఉన్న ముప్పు 

ఇప్పటికే తమీమ్ ఇక్బాల్‌కు మద్దతుగా తస్కిన్ అహ్మద్,మోమినుల్ హక్ వంటి సీనియర్ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. పరిస్థితి అదుపు తప్పుతున్ననేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలకు బోర్డుతో ఎలాంటి సంబంధం లేదని,అవి పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలేనని స్పష్టం చేసింది. ఆటగాళ్ల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినప్పటికీ,నజ్ముల్ రాజీనామా అంశంపై మాత్రం బోర్డు స్పష్టత ఇవ్వలేదు. దీంతోఆటగాళ్లు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గే పరిస్థితి కనిపించడం లేదు. గురువారం మధ్యాహ్నంలోపు డైరెక్టర్ రాజీనామా చేయాలని వారు గడువు విధించారు. బోర్డు స్పందించకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement