LOADING...
Brazil: ప్రపంచకప్‌ నుంచి బ్రెజిల్ నిష్క్రమణ.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్ వీడ్కోలు
ప్రపంచకప్‌కు బ్రెజిల్ గుడ్‌బై.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్ వీడ్కోలు

Brazil: ప్రపంచకప్‌ నుంచి బ్రెజిల్ నిష్క్రమణ.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్ వీడ్కోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫిఫా ప్రపంచకప్ 2026లో నార్వే చేతిలో బ్రెజిల్ అనూహ్యంగా ఓటమి చవిచూడడంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం నెయ్‌మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో దాదాపు 16 ఏళ్ల పాటు సాగిన అతని అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రయాణం ముగిసింది. బ్రెజిల్ తరఫున మొత్తం 129 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నెయ్‌మార్ 80 గోల్స్ నమోదు చేసి దేశ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2010లో మెట్లైఫ్ స్టేడియంలోనే బ్రెజిల్ జెర్సీతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు, అదే మైదానంలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడడం విశేషంగా నిలిచింది.

వివరాలు 

నెయ్‌మార్ తీవ్ర భావోద్వేగం 

నార్వేతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన నెయ్‌మార్ ఇంజూరీ టైమ్‌లో లభించిన పెనాల్టీని విజయవంతంగా గోల్‌గా మలిచాడు. అయితే అప్పటికే బ్రెజిల్ పరాజయం ఖరారవడంతో ఆ గోల్ జట్టును కాపాడలేకపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే నెయ్‌మార్ తీవ్ర భావోద్వేగానికి గురై మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ఆటగాళ్లు ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన నెయ్‌మార్, "ఎంతో ప్రయత్నించాను. కానీ ఇక నా ప్రయాణం ఇక్కడితో ముగిసింది. నా అంతర్జాతీయ కెరీర్ ఇక్కడే ప్రారంభమైంది.. ఇప్పుడు అదే చోట ముగియడం భావోద్వేగంగా ఉంది" అని పేర్కొన్నాడు.

వివరాలు 

బ్రెజిల్ చెత్త రికార్డు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినా క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ క్లబ్ శాంటోస్ ఎఫ్‌సీ తరఫున ఆడుతున్న నెయ్‌మార్, తన క్లబ్ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. ప్రపంచకప్‌లో యూరప్ జట్లపై బ్రెజిల్‌కు నిరాశాజనక రికార్డు కొనసాగుతోంది. 2002 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీపై విజయం సాధించి టైటిల్ గెలిచిన తర్వాత, ప్రపంచకప్ టోర్నీలో యూరోపియన్ ప్రత్యర్థిపై బ్రెజిల్ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది.

Advertisement

వివరాలు 

బ్రెజిల్ చెత్త రికార్డు

నార్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్‌తో చెలరేగి తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. మరోవైపు బ్రెజిల్‌కు తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ అవకాశాన్ని బ్రూనో గిమరాయెస్ వృథా చేశాడు. చివరి నిమిషాల్లో నెయ్‌మార్ గోల్ చేసినా, అప్పటికే ఫలితం తేలిపోవడంతో బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

Advertisement