LOADING...
England: బ్రూక్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్
బ్రూక్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్

England: బ్రూక్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే ఇంగ్లండ్‌ జట్టు అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతోంది. శ్రీలంక పర్యటనలో భాగంగా ముందుగా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. పల్లెకెలె వేదికగా జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం ఛేదన సమయంలో వర్షం అంతరాయం కలగడంతో డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో ఇంగ్లండ్‌కు 17 ఓవర్లలో 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

Details

రాణించిన రత్నాయకే

ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. ఇంగ్లండ్‌ విజయంలో టామ్‌ బాంటన్‌ కీలక పాత్ర పోషించాడు. అతను 54 పరుగులతో అజేయ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు హ్యారీ బ్రూక్‌ 12 బంతుల్లోనే 36 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ సిరీస్‌లో నామమాత్రంగా మిగిలిన మూడో టీ20 మ్యాచ్‌ ఫిబ్రవరి 3న జరగనుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో పవన్‌ రత్నాయకే 22 బంతుల్లో 40 పరుగులతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అతనికి తోడు పతుమ్‌ నిస్సంక (34), కమిల్‌ మిషారా (36), కుసాల్‌ మెండిస్‌ (32), అసలంక (28 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు.

Details

విధ్వంసం సృష్టించిన బ్రూక్

అయితే చివర్లో కెప్టెన్‌ దసున్‌ షనక 6 బంతుల్లో కేవలం ఒకే పరుగు చేయడంతో నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 2 వికెట్లు తీయగా, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో లక్ష్యం కుదిరిన తర్వాత ఇంగ్లండ్‌ బ్యాటర్లు ధాటిగా ఆడారు. టామ్‌ బాంటన్‌ (33 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్‌ కర్రన్‌ (14 బంతుల్లో 20 నాటౌట్‌; ఒక సిక్స్‌, ఒక ఫోర్‌) పరుగుల వరద పారించారు. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 39 పరుగులతో ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు.

Advertisement