Jasprit Bumrah: 969 రోజుల తర్వాత బుమ్రా రీఎంట్రీ.. వచ్చీ రాగానే రికార్డుల మోత!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. దాదాపు 969 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత వన్డే జట్టులోకి తిరిగి వచ్చిన బుమ్రా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడంతో ఒకేసారి పలు రికార్డులను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన 150వ వన్డే వికెట్‌ను నమోదు చేసిన బుమ్రా, భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ 100కిపైగా వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 234 వికెట్లు, టీ20ల్లో 121 వికెట్లు, వన్డేల్లో 150 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
రవీంద్ర జడేజా రికార్డు బద్దలు
ఇంగ్లండ్ గడ్డపై బుమ్రాకు ఇది 31వ వన్డే వికెట్. దీంతో ఆ దేశంలో అత్యధిక వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచి రవీంద్ర జడేజా రికార్డును అధిగమించాడు.
బుమ్రా 17 వన్డేల్లోనే 31 వికెట్లు సాధించగా, జడేజా 22 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీశాడు.
ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ 21 మ్యాచ్‌ల్లో 28 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, మదన్‌లాల్ 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు, మహ్మద్ షమీ 11 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బంతుల పరంగా అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు సాధించిన రెండో భారత పేసర్‌గా కూడా బుమ్రా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి అతడు 4,605 బంతులు మాత్రమే వినియోగించాడు.
వివరాలు
చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ ఆడిన బుమ్రా
ఈ జాబితాలో మహ్మద్ షమీ 4,070 బంతులతో అగ్రస్థానంలో ఉండగా, కుల్దీప్ యాదవ్ 4,513 బంతులతో బుమ్రా కంటే ముందున్నాడు.
మాజీ పేసర్ అజిత్ అగార్కర్ 5,027 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. కాగా, బుమ్రా చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు.
ఆ తర్వాత దాదాపు 969 రోజుల అనంతరం మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగి, రీఎంట్రీ మ్యాచ్‌లోనే చారిత్రక రికార్డులతో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.