Bumrah-Hardik: న్యూజిలాండ్ వన్డేలకు బుమ్రా, పాండ్యా ఔట్.. టీ20 ప్రపంచ కప్‌పై బీసీసీఐ ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మ్యాచ్‌లతో నిండిన షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు యాజమాన్యం కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఈ ఇద్దరు కీలక వైట్‌బాల్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Details
జనవరి 5న జట్టును ప్రకటించే అవకాశం
వన్డే సిరీస్‌కు దూరమైనప్పటికీ, ఆ వెంటనే జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు మాత్రం బుమ్రా, పాండ్యాలు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచకప్‌కు ముందు టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, కాంబినేషన్లు, ఆటగాళ్ల పాత్రలను ఖరారు చేయాలనే దిశగా టీమ్ మేనేజ్‌మెంట్ అడుగులు వేస్తోంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును జనవరి 4 లేదా 5 తేదీల్లో ప్రకటించే అవకాశముంది.
Details
ఇషాన్ కిషన్ లేదా జితేశ్ శర్మను ఎంపిక చేసే అవకాశం
ఇదే సమయంలో వన్డే సిరీస్‌కు వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. అతని గైర్హాజరీలో వికెట్‌కీపింగ్ బాధ్యతల కోసం ఇషాన్ కిషన్ లేదా జితేశ్ శర్మను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ మ్యాచ్‌లు జనవరి 11న బరోడా, జనవరి 14న రాజ్‌కోట్, జనవరి 18న ఇండోర్ వేదికలుగా జరగనున్నాయి. అనంతరం టీ20 సిరీస్ జనవరి 21 నుంచి 31 వరకు నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువాహటి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా కొనసాగనుంది.