IPL 2024 : ఐపీఎల్ ఆడాలని ఉంది.. మనసులో మాటను బయటపెట్టిన పాకిస్థాన్ బౌలర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం ఇప్పుడే సన్నహాలు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కు ఎంతో క్రేజ్ ఏర్పడింది. డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఈ టోర్నీ ఆడటానికి ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఐపీఎల్ టోర్నీ ఆడకుండా పాకిస్థాన్ ఆటగాళ్లను బీసీసీఐ(BCCI) నిషేధించింది. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో పాక్ ఆటగాళ్లు ఆడినప్పటికీ ఆ తర్వాత ఇరుదేశాల మధ్య రాజకీయపరమైన సంబంధాల కారణంగా పాక్ ప్లేయర్లపై నిషేధం విధించారు. తాజాగా ఐపీఎల్ టోర్నీపై పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవకాశం వస్తే తాను కూడా ఐపీఎల్ ఆడుతానని తన మనసులోని మాటను అతను బయటపెట్టాడు.
అవకాశం వస్తే తప్పకుండా ఆడుతా : హసన్ రాజా
ప్రతి ప్లేయర్ ఐపీఎల్ ఆడాలని కోరుకుంటాడని, తనకు కూడా ఐపీఎల్‌లో ఆడాలని ఉందని హసన్ రాజా పేర్కొన్నాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితంగా ఆడతానని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. గతంలో కూడా కొంతమంది పాకిస్థాన్ ప్లేయర్లు ఐపీఎల్‌లో అవకాశం వస్తే ఆడతామని చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో హసన్ అలీ ఆరు మ్యాచులు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.