LOADING...
Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు? ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం! 
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు? ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం!

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు? ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో అత్యధిక అభిమానగణం కలిగిన జట్లలో సన్‌ రైజర్స్ హైద‌రాబాద్‌ ఒకటి. అయితే 2026 సీజన్‌కు ముందు జట్టు నాయకత్వం మారబోతుందనే వార్తలు ఇటీవల గట్టిగా ప్రచారమయ్యాయి. ఈ రూమర్లు మరింత వేగం అందుకుంటుండగా, చివరకు సన్‌రైజర్స్ ఒకే పోస్టుతో అన్ని ఊహాగానాలకు బ్రేక్‌ వేసింది. కెప్టెన్సీ మార్పు అనేవి వదంతులేనని స్పష్టం చేస్తూ, పాట్ కమిన్స్‌నే 2026 సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో కమిన్స్‌కు ఇది వరుసగా మూడో సీజన్ అవుతుంది.

Details

ఫైనల్‌ దాకా తీసుకెళ్లిన కమిన్స్

ఆస్ట్రేలియా జట్టును ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌, 2023 వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్‌కు నడిపిన తర్వాత కమిన్స్‌పై సన్‌రైజర్స్ నజర్ పడింది. ఆయనను ఐపీఎల్ 2024 వేలంలోే రూ.20.50 కోట్ల రికార్డు మొత్తంతో తీసుకున్న హైదరాబాదు, వెంటనే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కమిన్స్ నాయకత్వంలో తొలి సీజన్‌ (2024)లోనే జట్టును ఫైనల్‌ వరకూ తీసుకెళ్లాడు. అయితే ట్రోఫీ మాత్రం తృటిలో చేజారింది.

Details

2025లో నిరాశ 

పెద్ద అంచనాలతో 2025 సీజన్ ప్రారంభించిన సన్‌రైజర్స్, ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం 6 విజయాలు మాత్రమే సాధించగా, 7 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చివరకు ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ నేపథ్యంలో కమిన్స్‌పై వేటు పడుతుందనే రూమర్లు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు జట్టు స్పష్టత ఇచ్చింది—కమిన్స్‌పై తమ నమ్మకం అటూఇటూ కాలేదని తెలిపింది.

Details

టీమ్‌లో కీలక మార్పులు

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ జట్టులో కొన్ని పెద్ద మార్పులు చేసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీను లక్నోకు ట్రేడ్ చేసింది. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ వంటి ఆటగాళ్లను రిలీజ్ చేసింది. మరోవైపు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లను రిటైన్ చేసింది.