IPL 2026-KKR: కేకేఆర్‌లోకి చెన్నై స్టార్ ఎంట్రీ.. ఆ ప్లేయర్ ట్రాక్ రికార్డు చూసి ఫ్యాన్స్ ఫిదా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్‌లో జరగనుండగా, ఫ్రాంచైజీలు విడుదల చేయాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 లోపు సమర్పించాల్సి ఉంది. ఈ తరుణంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించినట్లు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ప్రకటించారు. ఇక హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్ కేకేఆర్ కోచింగ్ బృందంలో పనిచేయనున్నాడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా, కోచ్‌గా సమృద్ధిగా అనుభవం ఉన్న షేన్ వాట్సన్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి జట్టును టైటిల్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే టోర్నమెంట్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు అందుకున్నాడు.
Details
కేకేఆర్ కోచింగ్ స్టాఫ్ లో షేన్ వాట్సన్
2013లో మరోసారి అదే అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్ 2018లో జట్టును ఛాంపియన్‌గా నిలిపే దిశగా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన వాట్సన్, ఇప్పుడు కేకేఆర్ కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు. ఈ కొత్త బాధ్యతపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20లు ఆడిన వాట్సన్ టెస్టుల్లో 3731, వన్డేల్లో 5757, టీ20ల్లో 1462 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో 4 శతకాలు నమోదు చేసిన షేన్ వాట్సన్ అనుభవం కేకేఆర్‌కు మరింత బలోపేతం కాబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.