Loading...
Hockey India Elections: హాకీ ఇండియా ఎన్నికలకు లైన్ క్లియర్.. డిసెంబర్ 5న పోలింగ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్!
హాకీ ఇండియా ఎన్నికలకు లైన్ క్లియర్.. డిసెంబర్ 5న పోలింగ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్!

Hockey India Elections: హాకీ ఇండియా ఎన్నికలకు లైన్ క్లియర్.. డిసెంబర్ 5న పోలింగ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

హకీ ఇండియా ఎన్నికలకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ సుప్రీంకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించింది. ఎన్నికలపై స్టే విధిస్తూ ఒడిశా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం పక్కనపెట్టింది. అంతేకాకుండా హాకీ ఒడిశాను శాశ్వత సభ్యత్వంలో కొనసాగించాలని ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘన పేరుతో ఆ సంస్థకు జారీ చేసిన రెండు షోకాజ్ నోటీసులతో పాటు, అసోసియేట్ మెంబర్‌గా మార్చాలన్న ప్రతిపాదనను కూడా రద్దు చేసింది. ఈ తీర్పుతో ప్రస్తుత అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.

వివరాలు

అంతర్జాతీయ గుర్తింపుపై ఆందోళన

ఎన్నికలు నిర్వహించకపోతే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) నుంచి గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

క్రీడా ప్రయోజనాలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్లు స్పష్టం చేసింది.

అనుబంధ విభాగాలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. గతంలో ఢిల్లీ హైకోర్టు సూచించిన విధంగా రిటైర్డ్ జస్టిస్ ఎ.కె. సిక్రీ నేతృత్వంలోని ఏకసభ్య ఫిర్యాదుల పరిష్కార కమిటీ వాటిని విచారిస్తుందని ధర్మాసనం తెలిపింది.

వివరాలు

వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ సాధ్యమేనా?

ఎన్నికలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రక్రియను ఎలా పూర్తి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అక్టోబర్ 22న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని, తదుపరి షెడ్యూల్‌పై ఎన్నికల అధికారి సుధీర్ త్రిపాఠి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాఖ్య వర్గాలు తెలిపాయి.

మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై హాకీ ఒడిశా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియ ఎలా పూర్తవుతుందో, తాను మళ్లీ పోటీ చేస్తానో లేదో తెలియదని చెప్పారు.

అయితే హాకీ ఒడిశాపై విధించిన సస్పెన్షన్ రద్దు కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

ADVERTISEMENT