Gautam Gambhir : టీ20 ప్రపంచ కప్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఆటగాళ్లకు గంభీర్ కీలక సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఆటగాళ్లంతా సంపూర్ణంగా సిద్ధమవ్వాలని సూచించాడు. ఫిట్‌నెస్ పరంగా, మానసికంగా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తుచేస్తూ, ప్రతి ఆటగాడు ఇప్పటి నుంచే పూర్తి కట్టుదిట్టమైన ప్రిపరేషన్‌లో ఉండాలని సూచించారు. బీసీసీఐ (BCCI) తన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (X) ద్వారా గంభీర్ వ్యాఖ్యలను పంచుకుంది. "టీమిండియా డ్రెస్సింగ్ రూం ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుంది. ఆ సంస్కృతిని అలాగే కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గంభీర్ అన్నారు.
Details
ప్రతి ఆటగాడూ ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను గుర్తించుకోవాలి
టీ20 ప్రపంచ కప్ చాలా ప్రతిష్ఠాత్మకమైన టోర్నీ. ఈ సమయంలో ప్రతి ఆటగాడూ ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను గుర్తించి తగిన శ్రద్ధ వహిస్తారని నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక టీ20 ప్రపంచ కప్ 2026 భారత్-శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌లోని అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వేదికలుగా ఖరారయ్యాయి. పాకిస్థాన్ ఆడే అన్ని మ్యాచ్‌లను రాజకీయ కారణాల దృష్ట్యా శ్రీలంకలోని కొలంబో, క్యాండీ వేదికల్లో నిర్వహించనున్నారు. పాకిస్థాన్ ఫైనల్ చేరుకుంటే ఆ తుదిపోరును కొలంబోలో, లేనిపక్షంలో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం.