LOADING...
Chinnaswamy Stadium : చిన్నస్వామి మైదానంలో మళ్లీ క్రికెట్ సందడి.. కానీ అభిమానులకు డోర్లు క్లోజ్!
చిన్నస్వామి మైదానంలో మళ్లీ క్రికెట్ సందడి.. కానీ అభిమానులకు డోర్లు క్లోజ్!

Chinnaswamy Stadium : చిన్నస్వామి మైదానంలో మళ్లీ క్రికెట్ సందడి.. కానీ అభిమానులకు డోర్లు క్లోజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్‌సీబీ గెలిచిన మరుసటి రోజు విక్టరీ పరేడ్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన తరువాత చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం తగినంత కాదని, పెద్ద ఎత్తున ప్రేక్షకులను అనుమతించడం సురక్షితం కాదని పలు నివేదికలు వెలువడ్డాయి. దీని ఫలితంగా చిన్నస్వామి వేదికగా జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025 మ్యాచ్‌లు ఇతర వేదికలకు మార్చబడ్డాయి. అయితే తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KCA) కీలక నిర్ణయం తీసుకుంది.

Details

సెప్టెంబర్ 26 నుంచి టోర్నీ ప్రారంభం

మళ్లీ చిన్నస్వామి వేదికగా మ్యాచ్‌లు నిర్వహించడానికి మార్గం సుగమమైంది. సెప్టెంబర్ 26 నుంచి కె. తిమ్మప్పయ్య మెమోరియల్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్‌లు చిన్నస్వామిలో జరుగనున్నాయి. ఇందులో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ కూడా ఉండటం గమనార్హం. అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్‌లను అభిమానులు ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించే అవకాశం ఉండదు. ప్రేక్షకుల ప్రవేశానికి అనుమతి ఇవ్వమని అధికారులు స్పష్టం చేశారు. ఈటోర్నీలో ముంబై, బరోడా, విదర్భ వంటి 16 జట్లు పాల్గొంటున్నాయి. స్టార్ క్రికెటర్లు అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్, హనుమ విహారి, విజయ్ శంకర్ వంటి ఆటగాళ్లు ఆడనున్నందున ఫ్యాన్స్ దృష్టి ఈ టోర్నీపై కేంద్రీకృతమైంది.