LOADING...
Sports facilities: షాకింగ్.. అథ్లెట్ల కోసం కేటాయించిన నిధులు.. అధికారుల స్పోర్ట్స్ క్లబ్‌లకు మళ్లింపా?
షాకింగ్.. అథ్లెట్ల కోసం కేటాయించిన నిధులు.. అధికారుల స్పోర్ట్స్ క్లబ్‌లకు మళ్లింపా?

Sports facilities: షాకింగ్.. అథ్లెట్ల కోసం కేటాయించిన నిధులు.. అధికారుల స్పోర్ట్స్ క్లబ్‌లకు మళ్లింపా?

వ్రాసిన వారు Moogati Shabari
May 14, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రీడాకారుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్‌ (NSDF) నిధులు అధికార యంత్రాంగానికి చెందిన విలాసవంతమైన క్రీడా సదుపాయాల కోసం వినియోగించారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ విషయంపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. క్రీడాకారులకు శిక్షణ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, కోచింగ్‌, స్పోర్ట్స్ సైన్స్ సపోర్ట్ అందించేందుకు 1998లో చారిటబుల్ ఎండౌమెంట్స్ చట్టం కింద NSDF‌ను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశమున్న అథ్లెట్లకు మద్దతు ఇచ్చే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌ (TOPS) వంటి కీలక పథకాలకూ ఈ నిధి ఉపయోగపడుతోంది.

వివరాలు

ఆ ప్రాజెక్టులకు నిధుల మళ్లింపు..

అయితే, 2021 నుంచి 2025 మధ్యకాలంలో ఈ నిధి నుంచి రూ.6.2 కోట్లకు పైగా డబ్బు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌ (CSOI), సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డ్‌ (CCSCSB), ఢిల్లీలోని న్యూ మోతి బాగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు మళ్లించినట్లు విచారణలో తేలింది. ఈ వివరాలు గత ఐదేళ్ల రికార్డులు, ఆర్టీఐ పత్రాలు, ప్రస్తుత. మాజీ ప్రభుత్వ అధికారులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా వెలుగులోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. విచారణలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో న్యూ మోతి బాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి. ఢిల్లీలో సీనియర్ బ్యూరోక్రాట్ల కోసం ఉన్న అత్యంత ప్రీమియం ప్రభుత్వ నివాస కాలనీల్లో ఈ క్రీడా సముదాయం ఉంది.

వివరాలు

రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

2024 జూన్‌లో ఈ కాంప్లెక్స్‌లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుద్ధరణ కోసం NSDF నుంచి రూ.2.2 కోట్ల గ్రాంట్‌కు ఆమోదం లభించినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వుడ్‌న్ ఫ్లోర్ బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్టులు, టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్‌, జిమ్నాసియం, బిలియర్డ్స్ గది, టెన్నిస్ కోర్టులు వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇదే కాంప్లెక్స్‌కు 2019లో ఖేలో ఇండియా పథకం కింద ఇప్పటికే రూ.2.8 కోట్ల నిధులు క్రీడా మౌలిక సదుపాయాల కోసం విడుదలైనట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

వివరాలు

రెండో విడతగా రూ.88 లక్షలు విడుదల..

ఇక NSDF గ్రాంట్ రెండో విడతగా సుమారు రూ.88 లక్షలు 2025-26లో విడుదలైనట్లు సమాచారం. అదే సమయంలో స్పోర్ట్స్ ఫండ్‌కు వచ్చే విరాళాలు గణనీయంగా తగ్గినట్లు డేటా చెబుతోంది. నివేదిక ప్రకారం 2023-24లో NSDF‌కు వచ్చిన విరాళాలు రూ.85.26 కోట్లుగా ఉండగా, 2025-26 నాటికి అవి రూ.37.02 కోట్లకు పడిపోయాయి.

Advertisement