Curacao: లక్షన్నర జనాభా.. వరల్డ్‌కప్ బెర్త్! క్యురసావ్ అద్భుతం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం భారత జనాభా 146 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద దేశం అయినా దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఫుట్ బాల్ వరల్డ్ కప్‌లో మనకు ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే... మన దేశంలోని ఓ చిన్న పట్టణం అంత జనాభా కూడా లేని ఒక దేశం మాత్రం వచ్చే ఏడాది సాకర్ వరల్డ్ కప్ మైదానంలో అడుగుపెట్టబోతోంది. ఆ దేశమే.. క్యురసావ్. కరీబియన్‌కు చెందిన ఈ చిన్న దీవి జనాభా కేవలం 1 లక్ష 56 వేల మంది మాత్రమే. ఇంత చిన్న దేశం, ప్రపంచకప్‌కు అత్యంత కఠినమైన అర్హత పరీక్షల మధ్య నుంచి దూసుకెళ్లి చోటు దక్కించుకోవడం గొప్ప విషయమే.
వివరాలు
డచ్ నెట్‌వర్క్
ఈ టోర్నీలో పాల్గొనే అత్యల్ప జనాభా దేశం ఇదే.ఇంతకాలం ఈ రికార్డు ఐస్‌లాండ్ వద్ద ఉండేది. సుమారు 3.5లక్షలు జనాభా ఉన్న ఆ దేశం 2018 వరల్డ్ కప్ కోటాను గెలుచుకుంది. ఇప్పుడు ఆ రికార్డును క్యురసావ్ చెరిపేసింది. భవిష్యత్తులో ఈ రికార్డు ఎప్పటికీ అలాగే నిలిచిపోయినా ఆశ్చర్యం లేదు. నెదర్లాండ్స్ కింగ్‌డమ్‌లో భాగమైన క్యురసావ్‌కి ఈ స్థాయికి రావడానికి అక్కడి డచ్ నెట్‌వర్క్ ఎంతో ఉపయోగపడింది. చిన్నప్పుడు నెదర్లాండ్స్ వయోవర్గ జట్లకు ఆడిన ఆరుగురు ఆటగాళ్లు ఇప్పుడు క్యురసావ్ జెర్సీ వేసుకుని ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అక్కడ సరైన ఫుట్‌బాల్ స్టేడియాలు,శిక్షణ సౌకర్యాలు దాదాపు లేనట్టే. అయినా వీళ్ళు విదేశాల్లో సాధన చేస్తూ,క్లబ్ ఫుట్‌బాల్ ఆడుతూ తమ స్కిల్స్ పెంచుకున్నారు.
వివరాలు
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్.. అసలు మిషన్
వాళ్లందరిని ఒక్క జట్టుగా మలచి, కఠినమైన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ముందుకు తీసుకెళ్లడం అసలు మిషన్. ఆ పని అద్భుతంగా పూర్తిచేశాడు డచ్ కోచ్ డిక్ అడ్వొకాట్. ఆయన వయస్సే 78 ఏళ్లు.. అయినా ఎనర్జీ మాత్రం యంగ్ కోచ్‌లకంటే ఎక్కువే! కోచ్‌గా ఆయన కెరీర్ చాలా పెద్దది. 1994 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌ను క్వార్టర్స్ వరకూ తీసుకెళ్లాడు. 2006లో దక్షిణ కొరియా జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు. అతని మార్గదర్శకత్వంలో అమెరికా కూడా వరల్డ్ కప్ బెర్త్ కొట్టింది. ఇప్పుడు అదే అనుభవం క్యురసావ్‌కు వరం అయింది. అయితే జట్టు అర్హతను ఖరారు చేసిన కీలక మ్యాచ్‌కు మాత్రం కోచ్ ఉండలేకపోయాడు. కుటుంబ కారణాల వల్ల స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది.
వివరాలు
మ్యాచ్ మొత్తం జమైకా ఆధిపత్యమే..
కోచ్ లేకున్నా క్యురసావ్ జట్టు తమకంటే బలమైన జమైకాను అడ్డుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ 0-0తో ముగిసింది.అసలైతే మ్యాచ్ మొత్తం జమైకా ఆధిపత్యమే సాగింది. స్టాపేజ్ టైంలో వారికి పెనాల్టీ కూడా లభించింది. కానీ వీడియో రివ్యూ చూసిన తర్వాత రిఫరీ ఆ నిర్ణయాన్ని రద్దు చేశాడు. అదే కొనసాగి ఉంటే క్యురసావ్ ప్రయాణం అక్కడితో ముగిసిపోయేది.దానికి ముందు బెర్ముడాపై 7-0తో ఘనవిజయం సాధించిన క్యురసావ్‌కి, జమైకాపై డ్రా సరిపొయింది.
వివరాలు
నరేంద్ర మోదీ స్టేడియంలో పట్టేంత జనాభా
ఆ ఒక్క పాయింట్ వాళ్లను ముందుకు నెట్టింది. భారత పరిస్థితిని చూస్తే మరింత విచిత్రంగా అనిపిస్తుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా దేశం ఎన్నాళ్లుగానో ప్రపంచకప్ అర్హత కోసం ప్రయత్నిస్తున్నా, ప్రమాణాలకు దగ్గర కూడా వెళ్లలేకపోతుంది. అలాంటిది కొంచెం సర్దుకుంటే నరేంద్ర మోదీ స్టేడియంలో పట్టేంత జనాభా ఉన్న దేశం ఈ టోర్నీకి అర్హత సాధించడం అద్భుతమే కదా!