Loading...
David Miller: ఆర్సీబీపై సెంచరీ.. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌: డేవిడ్ మిల్లర్
ఆర్సీబీపై సెంచరీ.. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌: డేవిడ్ మిల్లర్

David Miller: ఆర్సీబీపై సెంచరీ.. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌: డేవిడ్ మిల్లర్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 13, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

తన కెరీర్‌ నిలదొక్కుకోవడానికి ఐపీఎల్‌లో చేసిన ఓ సెంచరీనే కారణమని దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ మిల్లర్‌ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిల్లర్‌.. తన కెరీర్‌లో గుర్తుండిపోయిన ఇన్నింగ్స్‌లు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌ను గెలిచి క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఆడిన 101 పరుగుల ఇన్నింగ్స్‌ తన కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిందని మిల్లర్‌ చెప్పాడు. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన తనకు అదే తొలి టీ20 సెంచరీ అని గుర్తుచేసుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌ తర్వాత తన కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుందని తెలిపాడు.

వివరాలు

ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకం..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్‌ కూడా తనకు ఎంతో ప్రత్యేకమని మిల్లర్‌ పేర్కొన్నాడు.

డర్బన్‌ వేదికగా ఆస్ట్రేలియా లక్ష్య ఛేదనలో శతకం సాధించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

ఈ రెండు సెంచరీలు తీవ్ర ఒత్తిడిలో ఆడినవేనని, అందుకే అవే తన దృష్టిలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లని చెప్పాడు.

బ్యాటర్‌గా తనను తాను మ్యాచ్‌లను ముగించే స్థాయికి తీసుకెళ్లానని మిల్లర్‌ తెలిపాడు.

తాను మంచి ఫినిషర్‌నని భావిస్తున్నానని, ఆ విషయంలో గర్వంగా ఉందని చెప్పాడు. అయితే ఇప్పటికీ నేర్చుకోవడం మాత్రం ఆపలేదని స్పష్టం చేశాడు.

వివరాలు

2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం..

సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించాలంటే చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.

ముఖ్యంగా లక్ష్య ఛేదనలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తానని, అలాంటి సవాళ్లను తాను ఇష్టపడతానని మిల్లర్‌ వెల్లడించాడు.

37 ఏళ్ల డేవిడ్‌ మిల్లర్‌ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఇప్పటివరకు 178 వన్డేల్లో 4,611 పరుగులు, 140 టీ20ల్లో 2,806 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లు ఆడి 3,288 పరుగులు సాధించాడు.

మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం.

ADVERTISEMENT