1089 రోజుల తర్వాత వార్నర్ డబుల్ సెంచరీ.. కానీ అంతలోనే..
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులో చరిత్ర సృష్టించాడు. తన వందో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం టెస్టులో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 1089 రోజుల తర్వాత సెంచరీ చేసి.. విమర్శకుల నోళ్లను మూయించాడు. వార్నర్ మూడేళ్ల తర్వాత అద్భుత ఇన్నింగ్స్‌తో చేలరేగి.. తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. దీంతో పట్టరాని సంతోషంలో అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంలో కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 253 బంతుల్లో 200 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ మైదానాన్ని వీడాడు.
వందో టెస్టులో ద్విశతకం బాదిన మొదటి ఆస్ట్రేలియా ప్లేయర్ వార్నర్
వందో టెస్టులో ద్విశతకం బాదిన మొదటి ఆస్ట్రేలియా ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ జోరూట్ గతేడాది ఫిబ్రవరిలో ఈ పీట్ నమోదు చేశాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 91 ఓవర్లలో 3 వికెట్లకు 386 పరుగులు చేసింది. 45/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. వార్నర్‌కు తోడుగా స్టీవ్ స్మిత్(85) రాణించాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(48 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ(9 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 197 పరుగులకు చేరింది. ఈ నెల ప్రారంభంలో వార్నర్ తనమీద ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని రద్దు చేయాలంటూ చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకున్నాడు.