IPL 2026 : రెచ్చిపోయిన రిజ్వి.. ఢిల్లీ చేతిలో ముంబై చిత్తు చిత్తు !
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వి మరోసారి రెచ్చిపోయాడు. మొదటి మ్యాచ్‌లో లక్నోపై 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయం అందించిన అతను, ఈరోజు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 90 పరుగులు (7 ఫోర్లు, 7 సిక్సులు) చేసి మరోసారి మ్యాచ్‌ను తనవైపు తిప్పాడు. ఈ ప్రదర్శనతో ఢిల్లీకి వరుసగా రెండో విజయం లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులభంగా చేజ్ చేసింది. అయితే ఛేజింగ్ ప్రారంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 1 పరుగుతో, నితీష్ రానా ఖాతా తెరవకుండానే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది.
వివరాలు
ఆ ఇద్దరూ రఫ్పాడించారిలా..
సరైన సమయంలో రిజ్వి, నిస్సంకా కలిసి జట్టును నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. నిస్సంకా 44 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్స్) చేసి రిజ్వికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. నిస్సంకా ఔట్ అయిన తరువాత రిజ్వి మరింత దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. ఓటమి భయం నుంచి ఢిల్లీని బయటకు తీసుకుని, సులభ విజయానికి దారి తీసాడు. ముంబై బౌలర్లలో సాంట్నర్, కార్బన్ బాష్, దీపక్ చాహర్ తలా ఒక వికెట్ సాధించారు.
వివరాలు
ముంబై తడబాటు..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సులు), రోహిత్ శర్మ 35 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేసి కొంత మేర జట్టును ఆదుకున్నారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. యువ పేసర్ ముఖేష్ కుమార్ ప్రారంభంలోనే ర్యాన్ రిక్కల్‌టన్ (9), తిలక్ వర్మ (0) వికెట్లు తీసి ముంబైకి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అక్షర్ పటేల్ 10వ ఓవర్‌లో రోహిత్‌ను ఔట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు.
వివరాలు
బౌలర్లు సత్తా చాటారిలా..
తర్వాత సూర్యకుమార్ కూడా ఔట్ కావడంతో ముంబై జట్టు కష్టాల్లో పడింది. చివర్లో నమన్ ధిర్ 28 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్), సాంట్నర్ 18 నాటౌట్ చేయడంతో స్కోర్ 162కి చేరుకుంది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, నటరాజన్, విప్రాజ్ నిగమ్, ఎంగిడి ఒక్కో వికెట్ సాధించారు.