IPL 2023: ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్‌దే విజయం
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 145 పరుగుల అత్యల్ప స్కోర్ ను ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు సరైన శుభారంభం లభించలేదు. ఓపెనర్ హారీ బ్రూక్ ఏడు పరుగులు చేసి వెనుదిరిగాడు.రాహుల్ త్రిపాఠి (15), అభిషేక్ శర్మ (5), కెప్టెన్ మార్‌క్రమ్ (3) విఫలమయ్యారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(49)క్లాసెన్ (31), సుందర్(24) రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
దిల్లీ క్యాపిటల్స్ ని ఆదుకున్న అక్షర్ పటేల్, మనీశ్ పాండే
టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పృథ్వీ షా స్థానంలో వచ్చిన ఫిల్ సాల్ట్ ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. అటు తరువాత మిచెల్ మార్ష్ ను 5వ ఓవర్లో టి.నటరాజన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 8వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ రూపంలో ఢిల్లీకి అతిపెద్ద దెబ్బ తగిలింది.సుందర్ మొదటగా ఈ ఓవర్‌లో డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసి, ఆపై సర్ఫరాజ్ ఖాన్,అమన్ ఖాన్‌లను కూడా అవుట్ చేశాడు.ఈ ట్రిపుల్ దెబ్బ నుంచి ఢిల్లీ జట్టు కోలుకోలేకపోయింది. చివర్లో మనీష్ పాండే(34),అక్షర్ పటేల్(34) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.హైదరాబాద్ తరఫున సుందర్ 3,భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు.