Devon Conway Ruled Out: భారత్‌తో వన్డే సిరీస్‌కు డెవాన్ కాన్వే దూరం.. అతడి స్థానంలో నిక్ కెల్లీకి ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టుకు గాయాల సమస్య వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు దూరం కాగా.. తాజాగా డెవాన్ కాన్వే కూడా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కాన్వే స్థానంలో మిగిలిన మ్యాచ్‌ల కోసం నిక్ కెల్లీని న్యూజిలాండ్ జట్టులోకి పిలిచారు. తొలుత నాలుగు, ఐదు వన్డేల కోసం మాత్రమే కెల్లీని ఎంపిక చేసినప్పటికీ.. తాజా పరిణామాలతో రెండో, మూడో వన్డేలకూ అందుబాటులోకి వచ్చాడు. న్యూజిలాండ్-ఏ జట్టుతో కలిసి భారత్-ఏతో జరగనున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆడేందుకు కెల్లీని తొలుత ఎంపిక చేశారు. అయితే కాన్వే సిరీస్‌కు దూరం కావడంతో న్యూజిలాండ్-ఏ జట్టు నుంచి అతడిని విడుదల చేసి ప్రధాన జట్టులోకి తీసుకున్నారు.
వివరాలు
న్యూజిలాండ్-ఏ జట్టులోకి డేల్ ఫిలిప్స్
నిక్ కెల్లీ స్థానంలో ఆక్లాండ్‌కు చెందిన బ్యాటర్ డేల్ ఫిలిప్స్‌ను న్యూజిలాండ్-ఏ జట్టులోకి ఎంపిక చేశారు. అతడితో పాటు టిమ్ రాబిన్సన్ కూడా జట్టులో చేరనున్నాడు.
మరోవైపు గాయాల కారణంగా సైమన్ కీన్, బెన్ లిస్టర్, ఫ్రేజర్ షీట్ న్యూజిలాండ్-ఏ జట్టుకు దూరమయ్యారు. వీరిలో కీన్, షీట్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు చెరో ఆరు వికెట్లు పడగొట్టారు.
వీరిద్దరూ రాబోయే మూడు నుంచి నాలుగు వారాల్లో తమ దేశవాళీ జట్ల తరఫున తిరిగి ఆడే అవకాశం ఉంది.
బెన్ లిస్టర్ ఆక్లాండ్ జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుడివైపు పక్కటెముకల సమీపంలో గాయపడ్డాడు.
ప్రస్తుతం అతడు తిరిగి మైదానంలోకి వచ్చేందుకు అవసరమైన రికవరీ కార్యక్రమాన్ని అనుసరిస్తున్నాడు.
వివారాలు
న్యూజిలాండ్‌ను వెంటాడుతున్న గాయాలు
కాన్వే గాయం న్యూజిలాండ్ జట్టులో గాయాల సమస్యను మరింత పెంచింది.
ఇప్పటికే రచిన్ రవీంద్ర భుజం సమస్యతో బాధపడుతుండగా.. మార్క్ చాప్‌మన్ తొడ కండరాల గాయం కారణంగా సిరీస్‌కు ముందే జట్టుకు దూరమయ్యారు.
అయితే మరోవైపు మాట్ హెన్రీ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. శనివారం వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అతడు అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే, సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండో వన్డేలో గెలిచి సిరీస్‌లో తిరిగి పుంజుకోవాలని కివీస్ భావిస్తోంది.
వివరాలు
భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు వివరాలు
రెండో, మూడో వన్డేల కోసం ఎంపికైన జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, నిక్ కెల్లీ, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లెయిర్ టిక్నర్.
చివరి రెండు వన్డేల కోసం ఎంపికైన జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, లాకీ ఫెర్గూసన్, మిచెల్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.