LOADING...
Womens World Cup: ప్రపంచకప్‌ విజేతలకు వజ్రాల ఆభరణాల కానుక.. పారిశ్రామికవేత్త ఢోలాకియా గిఫ్ట్
ప్రపంచకప్‌ విజేతలకు వజ్రాల ఆభరణాల కానుక.. పారిశ్రామికవేత్త ఢోలాకియా గిఫ్ట్

Womens World Cup: ప్రపంచకప్‌ విజేతలకు వజ్రాల ఆభరణాల కానుక.. పారిశ్రామికవేత్త ఢోలాకియా గిఫ్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's World Cup) తొలిసారి విజేతగా నిలిచిన భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ చారిత్రాత్మక విజయంతో గర్వపడుతున్న దేశ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా మహిళా జట్టును అభినందిస్తూ బహుమతులను ప్రకటిస్తున్నారు. ఆ జాబితాలో సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలాకియా (Govind Dholakia) పేరు ప్రత్యేకంగా నిలిచింది. భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆయన విలువైన వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెల్‌లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఢోలాకియా ఇప్పటికే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ ద్వారా తెలియజేశారు.

Details

ప్రతి ప్లేయర్ కి వజ్రాల ఆభరణాలు

మహిళా జట్టు ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఒకవేళ వారు ఫైనల్ గెలిచి కప్పు సాధిస్తే, జట్టులోని ప్రతి ఆటగాడికి వజ్రాల ఆభరణాలు అందిస్తాను. అంతేకాకుండా వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేయిస్తాను. మహిళా క్రికెట్‌లో మన దేశానికి వెలుగులు అద్దిన ఈ ఆటగాళ్ల జీవితాలు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు భారత మహిళల జట్టు ప్రపంచకప్ విజేతగా నిలవడంతో ఢోలాకియా తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరఫున వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానెల్‌లను అందజేస్తానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

Details

మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి బహుమతి

శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడైన ఢోలాకియా గతంలో కూడా తన ఉద్యోగులకు పండగలు, ప్రత్యేక సందర్భాల్లో విలువైన బహుమతులు ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయానికి కీలకంగా నిలిచిన క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా ప్రకటించారు.