CWG 2026: దిలీప్ పరుగు బంగారం.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం!
ఈ వార్తాకథనం ఏంటి
కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు మరోసారి సత్తా చాటారు. గురువారం జరిగిన వివిధ విభాగాల పోటీల్లో భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు చేరాయి. పారా అథ్లెటిక్స్‌లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకం గెలవగా, మహ్మద్ బసిల్ రజతంతో మెరిశాడు. రెగ్యులర్ లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజత పతకం సాధించి వరుసగా రెండు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ కూడా రజత పతకం అందించాడు.
వివరాలు
పారా 100 మీటర్లలో భారత్ డబుల్ పోడియం
పారా పురుషుల 100 మీటర్ల టీ47 విభాగంలో దిలీప్ మహాదు గావిత్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
అతడు 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కామన్వెల్త్ గేమ్స్ రికార్డును నెలకొల్పాడు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ మహ్మద్ బసిల్ 10.83 సెకన్లతో రజత పతకం సాధించాడు.
ఇంగ్లాండ్‌కు చెందిన కెవిన్ సాంటోస్ 10.85 సెకన్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
దిలీప్ గెలిచిన ఈ స్వర్ణం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మూడో బంగారు పతకం.
అంతకుముందు మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, పారా మహిళల షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో షర్మిల ధన్‌ఖడ్ స్వర్ణ పతకాలు సాధించారు.
వివరాలు
మురళీ శ్రీశంకర్ చరిత్ర
రెగ్యులర్ పురుషుల లాంగ్‌జంప్‌లో 27 ఏళ్ల మురళీ శ్రీశంకర్ 8.09 మీటర్ల అత్యుత్తమ గెంతుతో రజత పతకం గెలిచాడు.
2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కూడా రజతమే గెలిచిన శ్రీశంకర్, వరుసగా రెండు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
2024లో మోకాలి గాయంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారినా, పట్టుదలతో పునరాగమనం చేసి మరోసారి పోడియంపై నిలిచాడు.
విజయం అనంతరం స్పందించిన శ్రీశంకర్.. "చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం గ్లాస్గోలో పోటీపడతానని కూడా అనుకోలేదని చెప్పాడు.
శ్రీశంకర్‌కు ముందు భారత్ తరఫున కామన్వెల్త్ లాంగ్‌జంప్‌లో సురేశ్ బాబు (కాంస్యం-1978), అంజు బాబి జార్జ్ (కాంస్యం-2002), ప్రజూష (రజతం-2010) మాత్రమే పతకాలు సాధించారు.
వివరాలు
పారా డిస్కస్‌లో నిరాశ
పారా డిస్కస్ త్రోలో భారత్‌కు ఆశించిన ఫలితం రాలేదు. ఎఫ్43 విభాగంలో సాగర్ 51.79 మీటర్ల త్రోతో ఏడో స్థానంలో నిలిచాడు.
ఎఫ్44 విభాగంలో దేవేందర్ కుమార్ 48.20 మీటర్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ట్రిపుల్ జంప్ ఫైనల్‌కు చిత్రవేల్, ప్రభు
పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్‌లో ప్రవీణ్ చిత్రవేల్, సెల్వ ప్రభు ఫైనల్‌కు అర్హత సాధించారు.
చిత్రవేల్ 16.41 మీటర్లతో రెండో స్థానంలో నిలవగా, ప్రభు 16.26 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.
లాన్‌బౌల్స్‌లో భారత్‌కు హ్యాట్రిక్ విజయం
పురుషుల లాన్‌బౌల్స్‌లో నవ్‌నీత్‌సింగ్, దినేశ్‌కుమార్ జోడీ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.
గురువారం జరిగిన మ్యాచ్‌లో టైబ్రేక్‌లో బోట్స్‌వానా జట్టును ఓడించి తమ విజయ పరంపరను కొనసాగించింది.
వివరాలు
మార్టినా దేవికి ఐదో స్థానం
తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న 18 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ మార్టినా దేవి మహిళల +86 కిలోల విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది.
ఆమె స్నాచ్‌లో 105 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 140 కిలోలు ఎత్తి మొత్తం 245 కిలోలు నమోదు చేసింది.
స్నాచ్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 103 కిలోలు ఎత్తడంలో విఫలమైన మార్టినా, చివరి ప్రయత్నంలో 105 కిలోలు విజయవంతంగా ఎత్తడం విశేషం.
వివరాలు
జావెలిన్ ఫైనల్లో నీరజ్‌తో పాటు మరో ఇద్దరు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్‌లో 79.61 మీటర్ల త్రోతో ఐదో స్థానంలో నిలిచాడు.
భారత్‌కు చెందిన రోహిత్ యాదవ్ 78.37 మీటర్లతో తొమ్మిదో స్థానం, యశ్వీర్ 78.36 మీటర్లతో పదో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నారు.
జావెలిన్ త్రో ఫైనల్ శుక్రవారం అర్ధరాత్రి 12.45 గంటలకు ప్రారంభం కానుంది.
వివరాలు
వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్‌కు రజతం
పురుషుల 110+ కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ భారత్‌కు మరో రజత పతకం అందించాడు.
అతడు స్నాచ్‌లో 176 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 212 కిలోలు ఎత్తి మొత్తం 388 కిలోలతో రెండో స్థానంలో నిలిచాడు.
న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ ఆండ్రూ 166 కిలోల స్నాచ్, 223 కిలోల క్లీన్ అండ్ జెర్క్‌తో మొత్తం 389 కిలోలు ఎత్తి కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇక పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్ సింగ్ తూర్ 20.27 మీటర్లతో ఐదో స్థానంలో, సమర్‌దీప్ సింగ్ 20.03 మీటర్లతో ఏడో స్థానంలో నిలిచారు.