BCB: బీసీసీఐతో చర్చలు జరుగుతున్నాయి.. భారత్ పర్యటనపై క్లారిటీ ఇచ్చిన తమీమ్ ఇక్బాల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ నిర్వహణపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్ నిర్వహణపై ప్రస్తుతం ఇరు బోర్డుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్‌పై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు.
వివరాలు
బీసీసీఐతో చర్చలు కొనసాగుతున్నాయి
ఇటీవల జూన్‌లో బీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్.. భారత్ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
"భారత్ సిరీస్‌పై ప్రస్తుతం చెప్పేందుకు ఎలాంటి తాజా సమాచారం లేదు.
బీసీసీఐతో మా చర్చలు కొనసాగుతున్నాయి. బీసీబీ సభ్యులు, బీసీసీఐ మధ్య ఈ-మెయిల్‌ల ద్వారా సమాచార మార్పిడి జరుగుతోంది. ఈ సిరీస్ తప్పకుండా జరిగేలా మా వంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నామని తమీమ్ చెప్పారు.
వివరాలు
బంగ్లాదేశ్ పూర్తిగా సురక్షితమే
భద్రతా అంశాలపై వస్తున్న సందేహాలను కూడా తమీమ్ ఇక్బాల్ కొట్టిపారేశారు. "బంగ్లాదేశ్ పూర్తిగా సురక్షితమైన దేశం.
భారత జట్టు తప్పకుండా ఇక్కడికి వస్తుందని నేను ఎంతో ఆశాభావంతో ఉన్నాను. సిరీస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు మా బోర్డు అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
కాగా ఇటీవల భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ వైదొలిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వివరాలు
అఫ్గానిస్థాన్ సిరీస్ వాయిదా పడే అవకాశం
సెప్టెంబరులో బంగ్లాదేశ్ పర్యటన జరిగితే భారత జట్టు షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో భారత్.. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ పర్యటనకు అవకాశం కల్పించేందుకు అఫ్గానిస్థాన్ సిరీస్‌ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై సంబంధిత ప్రభుత్వాలు, క్రికెట్ బోర్డుల అనుమతులు, లాజిస్టిక్స్ అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వివరాలు
ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టిన తమీమ్
ఇటీవల తమీమ్ ఇక్బాల్‌ను ఐసీసీ ఫ్రాంచైజీ లీగ్ కమిటీ ఛైర్మన్ గా కూడా నియమించారు. ఈ బాధ్యతలు చేపట్టడం తనకు గర్వకారణమని ఆయన అన్నారు.
తన తొలి ఐసీసీ సమావేశం సంతృప్తికరంగా జరిగిందని, ఫ్రాంచైజీ క్రికెట్‌కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వివిధ టీ20 లీగ్‌లను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ ఫార్మాట్‌కు అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన ఆదరణ పెరుగుతోందని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నారు.