Page Loader
Novak Djokovic: "నాపై విష ప్రయోగం జరిగింది".. టెన్నిస్ స్టార్‌ నోవాక్ జోకోవిచ్ సంచ‌ల‌న ఆరోప‌ణ..
"నాపై విష ప్రయోగం జరిగింది".. టెన్నిస్ స్టార్‌ నోవాక్ జోకోవిచ్ సంచ‌ల‌న ఆరోప‌ణ..

Novak Djokovic: "నాపై విష ప్రయోగం జరిగింది".. టెన్నిస్ స్టార్‌ నోవాక్ జోకోవిచ్ సంచ‌ల‌న ఆరోప‌ణ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై విషప్రయోగం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. 2022లో మెల్బోర్న్‌లోని ఓ హోటల్‌లో తనకు విషపూరిత ఆహారం ఇచ్చారని, ఆ ఆహారంలో సీసం, పాదరసం కలిసినట్టు గుర్తించానన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఆ ఏడాది అతన్ని ఆస్ట్రేలియాలో డిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. జోకోవిచ్ వీసాను రద్దు చేసి, అతన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనక్కి పంపించారు.

వివరాలు 

శరీరంలో అధిక స్థాయిలో ఖనిజాలు, లెడ్, మెర్క్యూరీ

తాజాగా, జీక్యూ మ్యాగ్జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2022లో జరిగిన ఈ సంఘటన గురించి పలు విషయాలు వెల్లడించారు. కోవిడ్ టీకా తీసుకోకపోవడం కారణంగా మెల్బోర్న్ హోటల్‌లో అతన్ని నిర్బంధించారనీ, ఆ సమయంలో ఆరోగ్యపరమైన స‌మ‌స్య‌లు త‌న‌లో ఏర్పడినట్టు చెప్పాడు. హోటల్‌లో ఇచ్చిన ఆహారం కలుషితమైందని గుర్తించినప్పటికీ, ఆ విషయంలో పబ్లిక్‌గా చెప్పలేదని, ఆయన శరీరంలో అధిక స్థాయిలో ఖనిజాలు, లెడ్, మెర్క్యూరీ ఉన్నట్లు గుర్తించానన్నారు. విషపూరిత ఆహారం ఇచ్చారా అన్న ప్రశ్నకు "అదొక్కటే మార్గంగా కనిపిస్తుంది" అని జోకోవిచ్ వెల్లడించారు.

వివరాలు 

 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు 

జోకోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ప్రముఖ ప్లేయర్. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొననున్నాడు. ఆదివారం నుంచి ఆ టోర్నీ ప్రారంభమవుతుంది, ఇది అతని 11వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడం. 2022 ఆస్ట్రేలియా వివాదం అతని కెరీర్‌కు ఇబ్బందిని కలిగించినప్పటికీ, ఆస్ట్రేలియా ప్రజల పట్ల అతనికి ఎటువంటి ద్వేషభావం లేదని స్పష్టం చేశాడు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదు, కానీ తన శరీరానికి తగినదే తీసుకునే హక్కు ఉన్నట్లు చెప్పాడు.