Loading...
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని మూడో స్థానంలో ఆడించొద్దు.. టీమిండియాకు మాజీ క్రికెటర్ల సూచన!
వైభవ్ సూర్యవంశీని మూడో స్థానంలో ఆడించొద్దు.. టీమిండియాకు మాజీ క్రికెటర్ల సూచన!

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని మూడో స్థానంలో ఆడించొద్దు.. టీమిండియాకు మాజీ క్రికెటర్ల సూచన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్థానంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెడుతున్న ఈ యువ ఆటగాడికి టీమిండియాలో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా అద్భుతంగా రాణించే వైభవ్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సరైన నిర్ణయమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. అయితే, అతడు ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంపై చర్చ మరింత పెరిగింది. వైభవ్‌ను మూడో స్థానంలో ఆడించకూడదన్నారు.

వివరాలు

ఓపెనర్‌గా అభిషేక్, సంజుకు ప్రాధాన్యం..

టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఓపెనింగ్‌ స్థానాల్లో అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌లకు ప్రాధాన్యం ఇస్తోంది.

అభిషేక్‌ శర్మ స్థానంపై పెద్దగా చర్చ లేకపోయినా, సంజు శాంసన్‌ బ్యాటింగ్‌ స్థానంలో మాత్రం గతంలో పలుమార్లు మార్పులు జరిగాయి.

2026 టీ20ప్రపంచకప్‌లో టోర్నమెంట్‌ ఉత్తమ ఆటగాడిగా నిలిచిన సంజుపై మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచుతోంది.

ఈనేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కినా, అతడిని ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తున్నారు. న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ముందు ఇషాన్‌ కిషన్‌ కుడి తొడ కండరానికి గాయమవడంతో జట్టుకు దూరమయ్యాడు.

వైభవ్‌కు తుది జట్టులో ఆడే అవకాశం లభించింది. అయితే, ఓపెనింగ్‌ చేసే అవకాశం ఇవ్వకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంతో అతడు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు.

వివరాలు

ఓపెనర్‌గా విధ్వంసకర రికార్డులు..

వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటివరకు సాధించిన అద్భుత ప్రదర్శనలన్నీ ప్రధానంగా ఓపెనర్‌గా ఆడినప్పుడే వచ్చాయి. ఐపీఎల్‌లో భారత ఆటగాడిగా అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు అతడి పేరిట ఉంది.

కేవలం 35 బంతుల్లోనే శతకం బాది తన బ్యాటింగ్‌ సత్తాను చాటాడు. అలాగే, 2026 అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

పవర్‌ప్లేలో ఫీల్డింగ్‌ ఆంక్షలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటం వైభవ్‌ ప్రత్యేకత. ఇన్నింగ్స్‌ తొలి ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచగల సామర్థ్యం అతడికి ఉంది.

అలాంటి ఆటగాడిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

వైభవ్‌ బ్యాటింగ్‌ స్థానంపై మాజీ క్రికెటర్ల అభ్యంతరం..

దీనివల్ల అతడి సహజమైన దూకుడు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. వైభవ్‌ సూర్యవంశీని మూడో స్థానంలో ఆడించడంపై మాజీ భారత క్రికెటర్లు మురళీ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైభవ్‌ తన అత్యుత్తమ ఆటను ఓపెనర్‌గా ఆడతాడని, అతడిని మిడిలార్డర్‌లోకి పంపించడం సరైన నిర్ణయం కాదని వారు అభిప్రాయపడ్డారు.

యువ ఆటగాడి సహజమైన ఆటతీరును మార్చడం కంటే, అనుభవం ఉన్న ఆటగాళ్లను వేర్వేరు బ్యాటింగ్‌ స్థానాల్లో ఆడించే అవకాశాలను పరిశీలించడం మంచిదని సూచించారు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు వైభవ్‌ తన సహజమైన ఆటను ఆడలేకపోయాడని అశ్విన్‌ పేర్కొన్నాడు.

ఆరో ఓవర్‌ సమయంలో క్రీజులోకి రావడం అతడి ఆటతీరుకు సరిపడదని అభిప్రాయపడ్డాడు.

ADVERTISEMENT

వివరాలు

మూడో టీ20లో వైభవ్‌కు ఓపెనింగ్‌ ఛాన్స్‌ దక్కేనా?

గతంలో సంజు శాంసన్‌ను కూడా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తూ, వైభవ్‌ను ఓపెనర్‌గా కొనసాగించే అంశంపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆలోచించాలని సూచించాడు.

ఇషాన్‌ కిషన్‌ మూడో టీ20కి కూడా దూరమయ్యే అవకాశం ఉండటంతో భారత జట్టు ఎలాంటి బ్యాటింగ్‌ కూర్పుతో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీకి ఓపెనింగ్‌ అవకాశం కల్పిస్తారా? లేక మూడో స్థానంలోనే కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీసుకునే నిర్ణయం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT