IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు వార్ ఫ్యాన్స్‌కు మజానిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది. సెకండ్ టెస్ట్ ముగిసిన తొమ్మిది రోజుల గ్యాప్ తర్వాత ఇండోర్‌లో రేపటి నుంచి మూడో టెస్టు ప్రారంభ కానుంది. తొలి రెండు మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను సరిచేసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా.. సిరీస్ క్లీన్ స్వీప్ పై గురి పెట్టిన ఇండియా తమ అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైఖేల్ కాస్ప్రోవిచ్ ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగంపై కీలక సూచనలు చేశాడు.
ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలి
బుధవారం ఇండోర్‌లో భారత్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో మిచెల్ స్టార్క్, కెమెరాన్ గ్రీన్, స్కాట్ బోలాండ్‌తో ఆస్ట్రేలియా బరిలోకి దిగాలని మాజీ పేసర్ మైఖేల్ కాస్ప్రోవిచ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రెండు టెస్టులో పాట్ కామిన్స్, ముగ్గురు స్పిన్నర్లతో కలిసి ఆస్ట్రేలియా ఆడిందని, ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైందన్నారు. తమకు ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదని, బోలాండ్ టెస్టులో 113 వికెట్లు తీసిన అనుభవం ఉందని మైఖేల్ తెలియజేశారు. మొదటి రెండు టెస్టులకు దూరమైన గ్రీన్, స్టార్క్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.