Fifa world cup: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాలు కష్టమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూసే ఫుట్ బాల్ వరల్డ్ కప్‌కు భారత్‌లో మాత్రం ప్రసార హక్కుల విషయంలో అనిశ్చితి నెలకొంది. ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నప్పటికీ.. భారత్‌లో మాత్రం క్రికెట్‌కే ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఫుట్‌బాల్‌ను ఫాలో అయ్యే ప్రేక్షకులు ఉన్నా.. వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది.
వివరాలు
12 నుంచి ఫిఫా వరల్డ్ కప్..
2026 ఫిఫా వరల్డ్ కప్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. భారీ ప్రైజ్‌మనీతో జరిగే ఈ టోర్నీకి సంబంధించిన ప్రసార హక్కులను భారత్ మినహా చాలా దేశాల్లో ఇప్పటికే కేటాయించారు. అయితే భారత్‌లో మాత్రం ఇప్పటివరకు ఏ సంస్థ కూడా మీడియా హక్కుల కోసం ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కనీసం కీలక మ్యాచ్‌లనైనా ఉచితంగా ప్రసారం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాల బాధ్యత తమది కాదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసారభారతి కోర్టుకు తెలిపింది. దీంతో భారత ఫుట్‌బాల్ అభిమానులకు మ్యాచ్‌లు చూసే అవకాశంపై అనుమానాలు నెలకొన్నాయి.
వివరాలు
ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న దేశాలివే..
ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌కు అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లలో దాదాపు 90 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి సమయంలోనే ప్రారంభం కానున్నాయి. జులై 20న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా రాత్రి 12.30 గంటలకు మొదలవుతుంది. అర్ధరాత్రి వేళల్లో మ్యాచ్‌లు ఉండటంతో భారత్‌లో వ్యూయర్‌షిప్ పెద్దగా ఉండదని భావిస్తున్న మీడియా సంస్థలు ప్రసార హక్కుల కొనుగోలుపై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి వంటి కొద్ది మంది స్టార్ ప్లేయర్లు మాత్రమే అభిమానులకు ఎక్కువగా పరిచయం. మిగతా ఆటగాళ్లకు పెద్దగా గుర్తింపు లేదు. ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటివరకు టీమిండియాకు ఆడే అవకాశం కూడా రాలేదు.