Yashasvi Jaiswal-Shafali Verma: డోపింగ్ టెస్టు వివాదం.. యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్లు యశస్వీ జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గత ఏడాది నిర్వహించాల్సిన నిర్ణీత డోప్ పరీక్షలకు ఈ ఇద్దరు హాజరుకాకపోవడంతో నాడా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో భాగంగా ఉన్న యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలు డోప్ పరీక్షలకు అందుబాటులో లేకపోవడంతో పాటు, గైర్హాజరుకు గల కారణాలను కూడా తెలియజేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో వారికి వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ నోటీసులు పంపినట్లు వెల్లడైంది. ఇక ఈ నోటీసుల విషయాన్ని నాడా ఇప్పటికే బీసీసీఐ, ఐసీసీకి కూడా తెలియజేసినట్లు సమాచారం.
వివరాలు
పరీక్షలు సమయంలో అందుబాటులో లేరు
గతేడాది డిసెంబర్ 17న యశస్వి జైస్వాల్‌కు, నవంబర్ 7న షఫాలీ వర్మకు డోప్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో వీరిద్దరూ పరీక్షలకు అందుబాటులో లేరని నాడా పేర్కొంది. దీంతో ఫిబ్రవరి నెలలో వారి నుంచి వివరణ కోరింది. కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా అధికారిక నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారి డోప్ టెస్టుకు హాజరుకాకపోవడం మాత్రమే డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడదు. కానీ 12 నెలల వ్యవధిలో మూడుసార్లు డోప్ పరీక్షలకు గైర్హాజరైతే రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముందని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ ఐపీఎల్ 2026లో బిజీగా ఉండగా, షఫాలీ వర్మ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతోంది.