LOADING...
Ben Stokes: పీకలదాకా మద్యం.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ల రచ్చ.. నిషేధం ముప్పు!
పీకలదాకా మద్యం.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ల రచ్చ.. నిషేధం ముప్పు!

Ben Stokes: పీకలదాకా మద్యం.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ల రచ్చ.. నిషేధం ముప్పు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. జట్టు ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్‌తో కలిసి మద్యం సేవించి, అనంతరం అపరిచితులతో ఘర్షణకు దిగిన ఘటన ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే స్టోక్స్, అట్కిన్సన్‌లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా స్టోక్స్ టెస్టు కెప్టెన్సీపై కూడా ఈ వివాదం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది.

వివరాలు

115 పరుగుల తేడాతో విజయం

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు బుధవారం ప్రారంభంకానుంది. తొలి టెస్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బౌలర్ గస్ అట్కిన్సన్‌లు బోర్డు అనుమతి లేకుండా రహస్యంగా ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అక్కడ ఇద్దరూ పీకలదాకా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అనంతరం హోటల్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో కొంతమంది అపరిచితులతో ఘర్షణకు దిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొని, ఒకరిపై ఒకరు బీర్ బాటిళ్లు విసురుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అట్కిన్సన్ వారించినప్పటికీ స్టోక్స్ వినిపించుకోకుండా ప్రత్యర్థి వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కిందపడేసి దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలు

వైరల్ గా మారిన వీడియో

ఈ ఘటనలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌లు కూడా గాయపడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఈసీబీ దృష్టికి వెళ్లడంతో బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బోర్డు అనుమతి లేకుండా బయటకు వెళ్లడమే తప్పు కాగా, నైట్‌క్లబ్‌కు వెళ్లి మద్యం సేవించి అపరిచితులతో గొడవపడటం మరింత తీవ్రమైన అంశంగా బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు సమాచారం. విచారణలో స్టోక్స్, అట్కిన్సన్‌ల తప్పు ఉన్నట్లు తేలితే ఇద్దరిపైనా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరినీ వేర్వేరుగా విచారించినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు

కెప్టెన్సీని నుంచి తొలగించే అవకాశం

దీంతో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టులో వీరిద్దరూ బరిలోకి దిగుతారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అంతేకాకుండా బెన్ స్టోక్స్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగించే అంశాన్ని కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇంగ్లండ్ జట్టులో నాయకత్వ మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. కాగా, బెన్ స్టోక్స్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కావని క్రికెట్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. గతంలో కూడా మద్యం సేవించి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే తరహాలో గతేడాది నవంబర్‌లో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కూడా నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు.

Advertisement

వివరాలు

హ్యారీ బ్రూక్ కు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు

న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌కు ముందు వెల్లింగ్టన్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో బౌన్సర్‌తో వాగ్వాదానికి దిగిన బ్రూక్‌కు, అక్కడే ఉన్న జాకబ్ బెథెల్ కూడా మద్దతుగా నిలిచాడు. అయితే ఆ ఘటన పెద్దగా ముదరకపోవడంతో ఈసీబీ వారిద్దరిపై కేవలం మందలింపు చర్యలతో సరిపెట్టింది. కానీ స్టోక్స్, అట్కిన్సన్ వ్యవహారాన్ని మాత్రం బోర్డు మరింత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ స్టోక్స్‌పై నిషేధం విధించబడితే, అతని స్థానంలో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement