FIFA World Cup: 10 మందితోనే మెక్సికోను మట్టికరిపించిన ఇంగ్లాండ్.. 3-2తో సంచలన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
సొంత ప్రేక్షకుల మద్దతుతో అజేయంగా ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్న మెక్సికోకు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 3-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో తదుపరి దశలో నార్వేతో తలపడనుంది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. సుమారు 80 వేల మందికి పైగా అభిమానులు మ్యాచ్‌ను వీక్షించగా, వారిలో మెక్సికో అభిమానులే అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ ఇంగ్లాండ్ ఒత్తిడికి లొంగకుండా అద్భుత ప్రదర్శన చేసింది.
వివరాలు
ద్వితీయార్ధంలో ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ
మ్యాచ్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జుడె బెల్లింగ్‌హామ్ 36వ, 38వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ సాధించి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, విరామానికి ముందే జులియన్ క్వినోనెస్ 42వ నిమిషంలో గోల్ చేయడంతో మెక్సికో ఆధిక్యాన్ని ఒక గోల్‌కు తగ్గించింది. స్కోరు 2-1గా మారింది. ద్వితీయార్ధంలో ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జారెల్ క్వాన్సా 54వ నిమిషంలో రెడ్ కార్డు అందుకోవడంతో మిగతా మ్యాచ్ మొత్తాన్ని ఇంగ్లాండ్ పది మంది ఆటగాళ్లతోనే కొనసాగించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
వివరాలు
ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 3-1కు పెంచిన కెప్టెన్
60వ నిమిషంలో లభించిన పెనాల్టీ అవకాశాన్ని కెప్టెన్ హ్యారీ కేన్ గోల్‌గా మలిచి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 3-1కు పెంచాడు. అనంతరం 69వ నిమిషంలో మెక్సికోకు కూడా పెనాల్టీ లభించగా, రౌల్ జిమెనెజ్ దాన్ని సద్వినియోగం చేసుకుని గోల్ నమోదు చేశాడు. దీంతో స్కోరు 3-2గా మారి మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. చివరి నిమిషాల్లో మెక్సికో సమం చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంగ్లాండ్ రక్షణ పటిష్టంగా నిలిచింది. మరో గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా ప్రత్యర్థిని నిలువరించి విలువైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
వివరాలు
ఇంగ్లాండ్ పేరిట అరుదైన రికార్డులు
ఈ మ్యాచ్‌లో దాదాపు 36నిమిషాల పాటు పదిమంది ఆటగాళ్లతోనే ఆడినప్పటికీ ఇంగ్లాండ్ విజయం సాధించడం విశేషం.విదేశీ గడ్డపై ఆ జట్టు నమోదు చేసిన అత్యంత గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచింది. 1966లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ను గెలిచిన ఇంగ్లాండ్,2020 యూరో కప్ ఫైనల్‌కూ స్వదేశంలోనే చేరుకుంది. అయితే విదేశీ వేదికపై ఇలాంటి కీలక నాకౌట్ మ్యాచ్‌లో సాధించిన ఈ విజయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా కెప్టెన్ హ్యారీ కేన్ రికార్డు సృష్టించాడు. అజ్టెకా మైదానంలో మెక్సికోకు అద్భుతమైన రికార్డు ఉంది.ఇప్పటివరకు అక్కడ ఆడిన 90మ్యాచ్‌లలో ఇది కేవలం మూడోఓటమి మాత్రమే కావడం ఈ విజయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.