IND vs ENG: టైటిల్ ఫేవరెట్‌గా మారిన ఇంగ్లండ్.. సూర్యసేనకు కఠిన పరీక్ష!
ఈ వార్తాకథనం ఏంటి
రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ ఈసారి టోర్నీ ఆరంభానికి ముందు పెద్దగా అంచనాలు లేవు. ప్రారంభ మ్యాచ్‌ల్లో చూపిన ఆటతీరు చూసిన తర్వాత ఆ జట్టుపై విశ్వాసం మరింత తగ్గింది. అయితే ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్‌కు సిద్ధమవుతున్న వేళ ఇంగ్లండ్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగై టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా మారిన ఆ జట్టు సూర్యకుమార్ సేనకు గట్టి సవాల్‌గా నిలవడం ఖాయం. కొన్నేళ్ల క్రితం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టుగా వెలిగింది ఇంగ్లాండ్. 2019లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. 2022లో రెండోసారి టీ20 కప్‌ను కూడా అందుకుంది.
Details
వెస్టిండీస్ చేతిలో ఓటమి
దూకుడైన బ్యాటర్లు, నాణ్యమైన ఆల్‌రౌండర్లు, పదునైన బౌలర్లతో ప్రత్యర్థులను భయపెట్టిన ఆ జట్టు గత రెండుమూడేళ్లలో తన ప్రభావాన్ని కోల్పోయింది. భారత్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను 1-4తో కోల్పోవడంతో కెప్టెన్ జాస్ బట్లర్ సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అతడి స్థానంలో హ్యారి బ్రూక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రదర్శనలో మార్పు కనిపించినా, ప్రపంచకప్‌కు మాత్రం ఇంగ్లండ్ తక్కువ అంచనాలతోనే అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై ఇంగ్లండ్ ఆట అనుమానాలు రేకెత్తించింది. 185కు పైగా లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కేవలం 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. తర్వాత వెస్టిండీస్ చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో సూపర్-8 చేరుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే సూపర్-8లో మాత్రం ఇంగ్లాండ్ పూర్తిగా మారిపోయింది.
Details
బ్యాటింగ్ లో సాల్ట్ కీలక పాత్ర
బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై శ్రీలంకకు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి, ఆ జట్టును 95కే కట్టడి చేసింది. పాకిస్థాన్‌పై 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 58కే 4 వికెట్లు కోల్పోయినా, హ్యారీ బ్రూక్ అద్భుత శతకంతో జట్టును గెలిపించాడు. చివరి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 160 పరుగుల లక్ష్యాన్ని చేధించి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్ విజయ రహస్యం సమష్టి ప్రదర్శనే. ఒక్క ఆటగాడిపై ఆధారపడకుండా సాగుతోంది. శ్రీలంక మ్యాచ్‌లో పిలిప్ సాల్ట్ 62 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ (3/22)తో పాటు ఇతర బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్రూక్ శతకం మ్యాచ్‌ను మలుపుతిప్పింది.
Details
రాణిస్తున్న స్పిన్నర్లు
న్యూజిలాండ్‌పై జాక్స్ (32 నాటౌట్, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయగా, టామ్ బాంటన్ 33 పరుగులతో సహకరించాడు. బ్యాటింగ్‌లో బ్రూక్, సాల్ట్, జాక్స్ ప్రధాన బలంగా మారారు. జాక్స్ ఈ టోర్నీలో 191 పరుగులు చేయడమే కాక 7 వికెట్లు కూడా తీశాడు. స్పిన్నర్లు అదిల్ రషీద్ (11 వికెట్లు), లియామ్ డాసన్ (10 వికెట్లు) అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సామ్ కర్రన్ బ్యాట్, బాల్‌తో సమర్థంగా రాణిస్తూ 149 పరుగులు, 6 వికెట్లు సాధించాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును అవమానం నుంచి కాపాడింది కూడా కరనే. బట్లర్, జాకబ్ బెథెల్ ఉత్తమ ఫామ్‌లో లేకపోయినా, మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పగల సామర్థ్యం వీరిద్దరికీ ఉంది.
Details
ఇంగ్లండ్ జట్టులో అల్ రౌండర్లు ఎక్కువ
సాల్ట్ కొద్దిసేపు క్రీజులో నిలిచినా ఫలితం మారిపోతుంది. ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం ఇంగ్లాండ్‌కు పెద్ద ప్లస్. జాక్స్, కరన్, రెహాన్ అహ్మద్, బెతెల్ బ్యాట్, బాల్‌తో ప్రభావం చూపగలరు. సెమీఫైనల్‌కు వేదికైన వాంఖడే స్టేడియం పిచ్‌పై స్పిన్ దళం కీలకం కానుంది. ప్రపంచ స్థాయి స్పిన్నర్ అడిల్ రషీద్ నుంచి భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు. జోఫ్రా ఆర్చర్ (10 వికెట్లు), కరన్‌లతో పేస్ విభాగం కూడా బలంగా ఉంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో చాలామందికి భారత్‌లో ఆడిన అనుభవం ఉంది.
Details
అందరూ ఐపీఎల్‌లో ఆడిన అనుభవజ్ఞులే
బట్లర్‌కు భారత పిచ్‌లు సుపరిచితం. జాక్స్, సాల్ట్, బ్రూక్, కరన్, ఆర్చర్, బెతెల్ అందరూ ఐపీఎల్‌లో ఆడిన అనుభవజ్ఞులే. గతంలో భారత్‌లో ఐదు టీ20ల సిరీస్ ఆడిన అనుభవం కూడా వారికి తోడ్పడనుంది. అందువల్ల సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ప్రణాళికలతో, అత్యుత్తమ ప్రదర్శనతోనే సూర్యకుమార్ సేన ఫైనల్ చేరగలుగుతుంది.