Loading...
Uma Kashvi: 15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ.. ఉమ కశ్వీ సంచలనం!
15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ.. ఉమ కశ్వీ సంచలనం!

Uma Kashvi: 15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ.. ఉమ కశ్వీ సంచలనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వైభవ్‌ సూర్యవంశీ.. భారత క్రికెట్‌లో ఇప్పుడు మారుమోగుతున్న పేరు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అతడి బాటలోనే ఓ యువ క్రికెటర్‌ దూసుకొస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో చోటు సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించింది ఉమ కశ్వీ. తాజా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆమెను సొంతం చేసుకుంది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఉమ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు దియా దయాళ్‌ (16 ఏళ్లు) పేరిట ఉండేది. ఆమె కూడా దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకే ప్రాతినిధ్యం వహించింది.

వివరాలు

ఏడేళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించింది

కర్ణాటకకు చెందిన ఉమ ఏడేళ్ల వయసులోనే క్రికెట్‌ ఆడటం ప్రారంభించింది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌ బౌలింగ్‌లోనూ నైపుణ్యం సాధించింది.

2023లో బెంగళూరులో నిర్వహించిన అంతర్‌ పాఠశాలల క్రికెట్‌ టోర్నీలో కేవలం 12 ఏళ్ల వయసులోనే అజేయంగా 217 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకుంది.

ఆ తర్వాత వయసు విభాగాల టోర్నీల్లోనూ నిలకడగా రాణిస్తూ ముందుకు సాగింది. 2025లో జరిగిన మహారాణి ట్రోఫీలో బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్టుకు ఉమ కెప్టెన్‌గా వ్యవహరించింది.

ఈ టోర్నీలో మైసూర్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 48 పరుగులు సాధించింది. ప్రస్తుత సీజన్‌లో అండర్‌-19 వన్డే టోర్నీలో కర్ణాటక జట్టు సెమీఫైనల్‌కు చేరడంలోనూ ఉమ కీలక పాత్ర పోషించింది.

వివరాలు

భారత అండర్‌-19 జట్టులో చోటు

2026 జాతీయ అండర్‌-19 టీ20 టోర్నీలో విదర్భతో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఉమ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. కేవలం 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.

ఈ ప్రదర్శనతో అదే ఏడాది జులైలో భారత అండర్‌-19 జట్టులో చోటు సంపాదించింది. శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరిగిన సిరీస్‌లోనూ తన సత్తా చాటింది.

తన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసింది. అలాగే రెండు వన్డేల్లో మరో రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో బౌలింగ్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

ఈ ఏడాది జరిగిన మహిళల అండర్‌-15 వన్డే టోర్నీలో ఉమ బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేసింది.

ADVERTISEMENT

వివరాలు

అండర్‌-15 టోర్నీలో పరుగుల వరద..

ఏకంగా 172 సగటుతో 516 పరుగులు సాధించింది. ఈ క్రమంలో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ నమోదు చేసింది. ముఖ్యంగా మణిపుర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 66 బంతుల్లోనే 156 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో ఉమ దేశీయ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని కూడా ఆకర్షించింది.

తాజాగా జరిగిన డబ్ల్యూపీఎల్‌ వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ ఆమెపై ఆసక్తి చూపించింది. చివరకు రూ.10 లక్షలు వెచ్చించి ఈ 15 ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులోకి తీసుకుంది.

ఇప్పటికే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించిన ఉమకు ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో ఆడే అవకాశం లభించింది.

ADVERTISEMENT

వివరాలు

భారత క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు

ఒకవేళ తొలి సీజన్‌లోనే దిల్లీ క్యాపిటల్స్‌ తుది జట్టులో చోటు దక్కించుకుంటే.. తన ఆటతీరుతో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

వైభవ్‌ సూర్యవంశీ తరహాలో ఉమ కూడా భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందేమో వేచి చూడాలి.

ADVERTISEMENT