Loading...
Craig Ervine Double Century: 41 ఏళ్ల వయసులో ఎర్విన్ డబుల్ సెంచరీ.. టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు!
41 ఏళ్ల వయసులో ఎర్విన్ డబుల్ సెంచరీ.. టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు!

Craig Ervine Double Century: 41 ఏళ్ల వయసులో ఎర్విన్ డబుల్ సెంచరీ.. టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

షార్జా వేదికగా జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారించారు. తొలుత జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్కును దాటగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగించింది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే 122.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసింది. దీంతో టెస్టు చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది.

వివరాలు

ఎర్విన్ అజేయ డబుల్ సెంచరీ.. మదెవెరె శతకం

జింబాబ్వే సీనియర్ బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 279 బంతులు ఎదుర్కొని 23 ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 206 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

టెస్టు క్రికెట్‌లో ఎర్విన్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. అతడికి తోడుగా ఆల్‌రౌండర్ వెస్లీ మదెవెరె కూడా శతకంతో చెలరేగాడు.

కేవలం 108 బంతుల్లోనే 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో జియావుర్ అక్బర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సలీమ్, అబ్దుల్ మాలిక్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బ్రెండన్ టేలర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వివరాలు

తొలి ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోర్లు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులకు ఆలౌటైంది.

ఆ జట్టు తరఫున బ్రెండన్ టేలర్ 131 పరుగులు చేయగా.. బ్రియాన్ బెన్నెట్ 128 పరుగులతో సెంచరీలు సాధించారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ కూడా దీటుగా స్పందించింది. కెప్టెన్ రహ్మత్ షా 173 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడగా.. సెదిఖుల్లా అటల్ 105 పరుగులతో శతకం నమోదు చేశాడు.

దీంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగులకు ఆలౌటై 10 పరుగుల ఆధిక్యం సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

41 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. అరుదైన రికార్డు

ఈ మ్యాచ్‌లో ద్విశతకం సాధించిన క్రెయిగ్ ఎర్విన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

ప్రస్తుతం ఎర్విన్ వయసు 41 ఏళ్ల 82రోజులు. ఓవరాల్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఎర్విన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎరిక్ రోవన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

1951లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 42 ఏళ్ల 6 రోజుల వయసులో 236 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఆటగాడు జాక్ హాబ్స్ 1924లో దక్షిణాఫ్రికాపై 41ఏళ్ల 195 రోజుల వయసులో 211పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

నాలుగో స్థానంలో పాస్తీ హెండ్రెన్

ఎర్విన్ 41 ఏళ్ల 82 రోజుల వయసులో 206 పరుగులతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ పాస్తీ హెండ్రెన్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

1930లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 ఏళ్ల 361 రోజుల వయసులో 205 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ గ్రాహం గూచ్ 40 ఏళ్ల 314 రోజుల వయసులో న్యూజిలాండ్‌పై 210 పరుగులు చేసి ఐదో స్థానంలో నిలిచాడు.

కాగా జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టెస్టు కూడా షార్జా వేదికగానే జరగనుంది. నవంబర్ 13 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ADVERTISEMENT