Loading...
Mohammad Rizwan: పాక్ క్రికెట్‌లో ముదురుతున్న వివాదం.. రిజ్వాన్‌కు పీసీబీ షాక్‌!
పాక్ క్రికెట్‌లో ముదురుతున్న వివాదం.. రిజ్వాన్‌కు పీసీబీ షాక్‌!

Mohammad Rizwan: పాక్ క్రికెట్‌లో ముదురుతున్న వివాదం.. రిజ్వాన్‌కు పీసీబీ షాక్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్‌లో సీనియర్ వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ మహ్మద్ రిజ్వాన్‌పై కొనసాగుతున్న విచారణ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. తనపై జరుగుతున్న విచారణ, ఆరోపణలపై బహిరంగంగా మాట్లాడేందుకు రిజ్వాన్‌ చేసిన ప్రయత్నాలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) రెండుసార్లు తిరస్కరించినట్లు ఓ నివేదిక తెలిపింది. రిజ్వాన్‌పై ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో అతనిపై ఎలాంటి తుది నిర్ధారణ వెలువడలేదు. నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) కూడా రిజ్వాన్‌పై తుది ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

వివరాలు

ఇంగ్లండ్ పర్యటన నుంచి ఏడుగురు ఆటగాళ్లకు ఉద్వాసన

ఇటీవల ఇంగ్లండ్ పర్యటన అనంతరం పాకిస్థాన్ టెస్టు జట్టు నుంచి విడుదలైన ఏడుగురు ఆటగాళ్లలో మహ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్ కూడా ఉన్నారు.

అనంతరం రిజ్వాన్, ఇమామ్‌-ఉల్‌-హక్‌లను NCCIA లాహోర్‌లోని జోహర్ టౌన్ కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించింది.

ఇంగ్లండ్ సిరీస్‌ సందర్భంగా పాకిస్థాన్ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి సమాచారం లీక్‌ అయిందన్న ఆరోపణలతో పాటు.. ఆటగాళ్ల పరిచయాలు, ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్‌ సెషన్లు, మ్యాచ్‌ల సమయంలో జరిగిన సమావేశాల గురించి కూడా అధికారులు ప్రశ్నించినట్లు తెలిపింది.

అలాగే రిజ్వాన్, ఇమామ్‌ల మొబైల్‌ ఫోన్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు అప్పగించింది.

వివరాలు

ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తు

NCCIA అధికారులు ఇద్దరు ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్, టెక్నికల్‌గా పరిశీలిస్తున్నారు. ఫోన్లలోని మెసేజ్‌లు, కాంటాక్టులు, ఇతర డిజిటల్‌ సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

దీంతో పాటు వారి ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

మొబైల్ ఫోన్లపై ప్రాథమిక పరిశీలనలో పెద్దగా కీలకమైన విషయం ఏదీ బయటపడలేదని వర్గాలు తెలిపినప్పటికీ.. తదుపరి ఫోరెన్సిక్‌ పరిశీలన కొనసాగుతోంది.

రిజ్వాన్‌ మొబైల్ ఫోన్‌ను ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

రెండుసార్లు అనుమతి కోరిన రిజ్వాన్

ఈ మొత్తం వ్యవహారంపై బహిరంగంగా వివరణ ఇచ్చేందుకు రిజ్వాన్‌ PCB అనుమతి రెండుసార్లు కోరినట్లు ఓ నివేదిక నివేదించింది.

తనపై వచ్చిన ఆరోపణలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న వ్యవహారం, ICCకి తాను రాసిన లేఖకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన భావించినట్లు సమాచారం.

తన సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని నిబంధనల ప్రకారం రిజ్వాన్ PCB అనుమతి కోరినట్లు వర్గాలు తెలిపాయి. సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని క్లాజ్ 4.1 ప్రకారం ఒప్పందానికి సంబంధించిన అంశాలపై బహిరంగ ప్రకటన చేయాలంటే బోర్డు అనుమతి అవసరం.

అయితే రిజ్వాన్ చేసిన రెండు అభ్యర్థనలను కూడా PCB తిరస్కరించింది. అయితే పీసీబీని లేదా మరే సంస్థనైనా నిందించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ICC యాంటీ కరప్షన్ యూనిట్‌కు లేఖ

కేవలం జరిగిన పరిణామాలపై తన వాదన, తన వైపు ఉన్న విషయాలను ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నట్లు రిజ్వాన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఈ వ్యవహారంపై రిజ్వాన్‌ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) యాంటీ కరప్షన్ యూనిట్ (ACU)ను కూడా సంప్రదించినట్లు సమాచారం.

తన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న వ్యవహారంపై మార్గదర్శకత్వం, స్పష్టత కోరినట్లు ఆ నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉంటే NCCIAకు రిజ్వాన్‌ లిఖితపూర్వక సమాధానం కూడా ఇచ్చారు. తనను ఎందుకు విచారణకు పిలిచారో, తనపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో స్పష్టత ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.

వివరాలు

విచారణకు సహకరించగలను

ఆరోపణల పూర్తి వివరాలు అందిస్తేనే విచారణకు సహకరించగలనని తన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిపింది.

ప్రస్తుతం రిజ్వాన్‌పై NCCIA విచారణ కొనసాగుతోంది. మొబైల్ ఫోన్‌లోని డిజిటల్‌ సమాచారం, ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో రిజ్వాన్‌పై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ధారణ అధికారికంగా వెలువడలేదు.

ADVERTISEMENT