LOADING...
Women's T20 World Cup: సెమీస్‌కు చేరని భారత్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ప్రపంచకప్‌కు వీడ్కోలు
సెమీస్‌కు చేరని భారత్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ప్రపంచకప్‌కు వీడ్కోలు

Women's T20 World Cup: సెమీస్‌కు చేరని భారత్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ప్రపంచకప్‌కు వీడ్కోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల T20 ప్రపంచ కప్'లో సెమీస్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆదివారం భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 27 బంతుల్లో 56 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడగా, షెఫాలి వర్మ 26 బంతుల్లో 34 పరుగులతో రాణించింది. స్మృతి మంధాన 37 బంతుల్లో 38 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్‌ 28 బంతుల్లో 34 పరుగులు చేసినప్పటికీ ఇద్దరూ నెమ్మదిగా ఆడటంతో భారత్‌ ఆశించినంత భారీ స్కోరు చేయలేకపోయింది.

వివరాలు 

2 వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌ శ్రీ చరణి

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తరఫున ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఎలీస్‌ పెర్రీ 38 బంతుల్లో 56 పరుగులు, ఆష్లీ గార్డ్‌నర్‌ 29 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. 19 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. భారత స్పిన్నర్‌ శ్రీ చరణి 2 వికెట్లు తీసి మరోసారి ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయింది. గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా 10 పాయింట్లతో, దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో సెమీస్‌కు చేరగా.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లాండ్‌ 10 పాయింట్లు, వెస్టిండీస్‌ 6 పాయింట్లతో ముందంజ వేశాయి.

వివరాలు 

ఆశలు చిగురించినా.. చివర్లో చేజారిన విజయం

లక్ష్యం మరీ పెద్దది కాకపోయినా..భారత్‌ గెలవడానికి మంచి అవకాశాలే కనిపించాయి. ఛేదన ఆరంభంలోనే రేణుక అద్భుత బౌలింగ్‌తో రెండో బంతికే జార్జియా వోల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే బెత్‌ మూనీ,ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ జట్టును నిలబెట్టడంతో ఆస్ట్రేలియా స్కోరు 54/1కు చేరింది. ఈ దశలో టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబరిచిన తెలుగమ్మాయి శ్రీ చరణి మరోసారి తన ప్రతిభను చాటింది. ప్రమాదకర లిచ్‌ఫీల్డ్‌ను ఔట్‌ చేసి భారత్‌ను మళ్లీ పోటీలోకి తీసుకొచ్చింది. అనంతరం మరో స్పిన్నర్‌ దీప్తి శర్మ బెత్‌ మూనీ వికెట్‌ తీయడంతో ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడింది. నెమ్మదిగా ఉన్న పిచ్‌ను భారత స్పిన్నర్లు సమర్థంగా వినియోగించుకోవడంతో 12 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు 85/3గా నిలిచింది.

Advertisement

వివరాలు 

17వ ఓవర్లో 17 పరుగులు

చివరి 8 ఓవర్లలో 86 పరుగులు చేయాల్సిన పరిస్థితి రావడంతో భారత్‌కు విజయావకాశాలు స్పష్టంగా కనిపించాయి. అయితే అనుభవజ్ఞులైన ఎలీస్‌ పెర్రీ,ఆష్లీ గార్డ్‌నర్‌ మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పారు. రాధా యాదవ్‌ వేసిన 13వ ఓవర్లో ఆష్లీ ఒక ఫోర్‌,ఒక సిక్స్‌ బాదగా..పెర్రీ కూడా బౌండరీ సాధించింది. ఆ ఓవర్లో మొత్తం 17 పరుగులు రావడంతో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 15వ ఓవర్లో శ్రీ చరణి 16 పరుగులు ఇవ్వడంతో సమీకరణం 30 బంతుల్లో 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత రేణుక వేసిన 17వ ఓవర్లో 17 పరుగులు రావడంతో మ్యాచ్‌ పూర్తిగా ఆస్ట్రేలియా వైపు వెళ్లిపోయింది. చివరి దశలో భారత్‌ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ వరుస తప్పిదాలు చేయడంతో ఓటమి తప్పలేదు.

Advertisement

వివరాలు 

అతి జాగ్రత్తే భారత్‌కు ప్రతికూలంగా మారింది

పెర్రీ ఔటైనా అప్పటికే ఆలస్యమైపోయింది. 19వ ఓవర్‌ చివరి బంతికి జార్జియా ఫోర్‌ బాది విజయాన్ని ఖాయం చేసింది. ఇంతకుముందు బ్యాటింగ్‌లో భారత బ్యాటర్లు ప్రదర్శించిన అతి జాగ్రత్త కూడా జట్టుకు నష్టమే చేసింది. వికెట్లు కాపాడుకుంటూ పెద్ద స్కోరుకు పునాది వేయాలన్న ఉద్దేశంతో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ నెమ్మదిగా ఆరంభించారు. కుదురుకున్న తర్వాత షెఫాలి వేగంగా పరుగులు సాధించినా, స్మృతి మాత్రం ఇన్నింగ్స్‌ మొత్తం వేగం పెంచలేకపోయింది. బంతికో పరుగు చొప్పున ఆడిన ఆమె 12వ ఓవర్లో రనౌట్‌గా వెనుదిరిగింది. అంతకుముందే షెఫాలి కూడా ఔటైంది.

వివరాలు 

రిటైర్డ్‌ ఔట్‌గా జెమీమా

ఆష్లీ గార్డ్‌నర్‌ బౌలింగ్‌లో ఒక సిక్స్‌, ఒక ఫోర్‌తో జోరు చూపించిన షెఫాలిని మోలనూ బౌల్డ్‌ చేయడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌లో వేగం పూర్తిగా తగ్గిపోయింది. జెమీమా రోడ్రిగ్స్‌ స్వేచ్ఛగా షాట్లు ఆడలేక ఇబ్బంది పడగా,హర్మన్‌ప్రీత్‌ అప్పుడప్పుడూ బౌండరీలు బాదుతూ రన్‌రేట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. 19వ ఓవర్లో జెమీమా ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద వేర్‌హామ్‌ వదిలేయడంతో అది సిక్స్‌గా మారింది. ఆ ఓవర్‌ ముగిసిన వెంటనే జెమీమా రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగింది.

వివరాలు 

వరుసగా మూడు సిక్సర్లు బాదిన కెప్టెన్ 

అప్పటికే భారత్‌ స్కోరు ఒక ఓవర్‌ మిగిలి ఉండగా 147 పరుగులే. అయితే చివరి ఓవర్‌లో మోలనూ బౌలింగ్‌ను హర్మన్‌ప్రీత్‌ చితక్కొడుతూ వరుసగా మూడు సిక్సర్లు బాదింది. చివరి బంతికి దీప్తి శర్మ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. దీంతో భారత్‌ స్కోరు 170 పరుగులకు చేరినా, అది విజయానికి మాత్రం సరిపోలేదు.

Advertisement