LOADING...
IPL: క్రికెట్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌ సందడి స్టార్ట్
క్రికెట్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌ సందడి స్టార్ట్

IPL: క్రికెట్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌ సందడి స్టార్ట్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ఇంకా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. ప్రస్తుతం తొలి 20 మ్యాచ్‌ల వివరాలనే ప్రకటించింది. ఈ నెల 28న లీగ్‌ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో సొంత మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనున్నాయి. తదుపరి రోజు వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు పోటీపడతాయి. రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మిగతా షెడ్యూల్‌ను సిద్ధం చేసే ప్రక్రియలో బీసీసీఐ ఉంది. ఎన్నికల సంఘం తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో, పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది.

వివరాలు

ధోనీకి ఇదే చివరి సీజన్‌నా?

అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కాలం క్రితమే వీడ్కోలు పలికినప్పటికీ ధోనీ క్రేజ్‌ మాత్రం ఇంకా తగ్గలేదు. అయితే ఇప్పటికే 44 ఏళ్ల వయసుకు చేరుకున్న ధోనీ ఇంకెంతకాలం ఆడతాడన్న ప్రశ్న తలెత్తుతోంది. అతని ఫామ్‌ కొంత తగ్గిందన్నది చాలా మంది అంగీకరిస్తున్నారు. గతంలో కూడా ధోనీ ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాలు వినిపించినా, ధోనీ కెప్టెన్సీని వదిలి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కూడా అతని రిటైర్మెంట్‌పై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. 2026 సీజన్‌ అతనికి చివరిదిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌ జట్టులో చేరడంతో తన బాధ్యతలను తగ్గించుకునే అవకాశం అతనికి లభించింది.

వివరాలు

యుద్ధ ప్రభావంపై ఆందోళనలు

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేయొచ్చన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. టోర్నమెంట్‌ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులు నిర్వహణకు సవాలుగా మారాయి. గల్ఫ్‌ ప్రాంతంలో విమాన రాకపోకలు మూసివేయడం వల్ల విదేశీ ఆటగాళ్ల రాకపోకలు కష్టతరంగా మారాయి. టీ20 ప్రపంచకప్‌ అనంతరం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ ఆటగాళ్లు స్వదేశాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దుబాయ్‌, దోహా వంటి ముఖ్యమైన ట్రాన్సిట్‌ కేంద్రాల్లో విమాన సర్వీసులపై ఆంక్షలు ఉండటంతో ఫ్రాంఛైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు.

Advertisement

వివరాలు

కొత్త కుర్రాళ్లపై దృష్టి

ఈ సీజన్‌లో కొందరు యువ ఆటగాళ్లు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నారు. వేలంలో భారీ ధరలకు కొనుగోలు చేసిన వీరు ఆ అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శన చేస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ (రూ.14.2 కోట్లు, చెన్నై), వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కార్తీక్‌ శర్మ (రూ.14.2 కోట్లు, చెన్నై), పేసర్‌ మంగేశ్‌ యాదవ్‌ (రూ.5.20 కోట్లు, ఆర్సీబీ), ఫాస్ట్‌ బౌలర్‌ అకిబ్‌ నబి (రూ.8.40 కోట్లు, ఢిల్లీ), వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ తేజస్వి దహియా (రూ.3 కోట్లు, కోల్‌కతా)పై ఆయా జట్లు భారీ ఆశలు పెట్టుకున్నాయి. వేలంలో అంచనాలకు మించి ధరలు పలికించిన ఈ యువకులు మైదానంలో ఎలా రాణిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement