LOADING...
FIFA: రేపటి నుంచి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌.. మెరిపించేందుకు టీనేజ్‌ స్టార్స్‌ రెడీ
రేపటి నుంచి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌.. మెరిపించేందుకు టీనేజ్‌ స్టార్స్‌ రెడీ

FIFA: రేపటి నుంచి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌.. మెరిపించేందుకు టీనేజ్‌ స్టార్స్‌ రెడీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌ బాల్ ప్రపంచకప్ టోర్నీ కేవలం జట్ల మధ్య పోరాటమే కాదు.. కొత్త సూపర్ స్టార్లకు వేదిక కూడా. ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడు. కొన్ని సందర్భాల్లో ప్రపంచకప్ కొందరిని ఒక్కసారిగా హీరోలుగా నిలబెడితే.. మరికొందరికి నిరాశనే మిగులుస్తుంది. అందుకే యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంటారు. ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న మెస్సీ, రొనాల్డో, నెమార్, ఎంబాపె, మోడ్రిచ్ వంటి దిగ్గజాలు కూడా ఒకప్పుడు ఇలాంటి వేదికల ద్వారానే తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

వివరాలు 

ముందంజలో స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల లామినె యామల్

అమెరికా, కెనడా, మెక్సికో వేదికలుగా రేపటి నుంచి ప్రారంభమయ్యే 23వ ప్రపంచకప్ టోర్నీలోనూ పలువురు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ జాబితాలో స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల లామినె యామల్ ముందంజలో ఉన్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన యూరో టోర్నీలో స్పెయిన్ నాలుగోసారి ఛాంపియన్‌గా నిలవడంలో యామల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్‌లో కూడా అతడు అదే జోరు కొనసాగిస్తే స్పెయిన్ టైటిల్ ఫేవరెట్‌గా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. డిఫెండర్లను మోసం చేస్తూ ముందుకు దూసుకెళ్లడం, సహచరులకు అద్భుతమైన పాస్‌లు అందించడం, దూరం నుంచి గోల్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకొని శక్తివంతమైన షాట్లు కొట్టడం యామల్ ప్రత్యేకత.

వివరాలు 

ఎస్టవో విలియన్‌పై భారీ అంచనాలు

మరోవైపు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్ జట్టులో స్టార్ ఆటగాడు నెమార్ చివరిసారి ప్రపంచకప్ బరిలోకి దిగుతుండగా..అతని వారసుడిగా 18ఏళ్ల ఎస్టవో విలియన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అభిమానులు అతడిని'న్యూ నెమార్'గా పిలుస్తున్నారు.ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించి గోల్స్ సాధించడంలో విలియన్ తనదైన ముద్ర వేసుకున్నాడు. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ భవిష్యత్తులో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినా ఆ జట్టు బలహీనపడదనే నమ్మకాన్ని 18ఏళ్ల ఫ్రాంకో మస్తాంటువానో కల్పిస్తున్నాడు.

Advertisement

వివరాలు 

ఫ్రాన్స్ జట్టు రేసులో నిలవాలంటే..

అర్జెంటీనా వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్ సాధించాలంటే మెస్సీతో పాటు ఫ్రాంకో ప్రదర్శన కూడా కీలకంగా మారనుంది. ఇక ఫ్రాన్స్ జట్టు వరుసగా మూడో ప్రపంచకప్ ఫైనల్ రేసులో నిలవాలంటే సీనియర్ స్టార్లు ఎంబాపె, డెంబెలేతో పాటు 19ఏళ్ల డిసిర్ డుయు ఆటతీరు ఎంతో ముఖ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల యూరోపియన్ చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచిన పీఎస్‌జీ జట్టుకు డిసిర్ డుయు ప్రాతినిధ్యం వహిస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు.

Advertisement

వివరాలు 

సూపర్ స్టార్‌గా అవతరిస్తారో..

వీరిద్దరితో పాటు మెక్సికోకు చెందిన గిల్బెర్టో మోరా, సెనెగల్ యువ ఆటగాడు ఇబ్రహీం ఎంబాయె, అర్జెంటీనా స్టార్ నికో పాజ్,టర్కీకి చెందిన అర్దా గులెర్,స్పెయిన్ డిఫెండర్ పౌ కుబార్సీ,ఐవరీకోస్ట్ ఆటగాడు యాన్ డియోమండె, బ్రెజిల్‌కు చెందిన ఆండ్రీ సాంతోస్,ఎండ్రిక్,నార్వే స్టార్ ఆంటోనియో నూసా కూడా ఈ ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యువ తారల్లో ఎవరు కొత్త సూపర్ స్టార్‌గా అవతరిస్తారో చూడాలంటే ప్రపంచకప్ ప్రారంభం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement