FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఉపయోగించే టర్ఫ్ విక్రయం.. ఒక్క ముక్క ధర రూ.43 వేలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశించగా, మిగిలిన రెండు స్థానాలు రేపటిలోగా ఖరారు కానున్నాయి. జులై 19న అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ అనంతరం మైదానంలో ఉపయోగించిన టర్ఫ్‌ను చిన్న చిన్న ముక్కలుగా విభజించి అభిమానులకు విక్రయించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అయితే ఒక్కో టర్ఫ్ ముక్క పరిమాణం ఎంత ఉంటుందనే విషయాన్ని ఫిఫా ఇంకా వెల్లడించలేదు. ఫిఫా అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఒక్కో టర్ఫ్ ముక్క ధర 450 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.43 వేల వరకు ఉంటుంది.
వివరాలు
వారికి మాత్రమే పంపిణీ..
ఈ సందర్భంగా ఫిఫా మాట్లాడుతూ, ప్రతి టర్ఫ్ ముక్క నిజంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించిన మైదానం నుంచే సేకరించబడిందని తెలిపింది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో ఒకటైన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చిన మెట్‌లైఫ్ స్టేడియం జ్ఞాపకాన్ని అభిమానులు జీవితాంతం భద్రపరుచుకునేలా ఈ ప్రత్యేక సేకరణను అందిస్తున్నామని పేర్కొంది. అయితే ఈ టర్ఫ్ ముక్కలను అమెరికా, యూరప్ దేశాల్లో నివసించే అభిమానులకు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
వివరాలు
మెట్‌లైఫ్ స్టేడియంపై ఇప్పటికే విమర్శలు..
ఇదిలా ఉండగా, మెట్‌లైఫ్ స్టేడియంలోని టర్ఫ్ నాణ్యతపై ఇప్పటికే పలువురు కోచ్‌లు, ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మైదానంలో ఉపయోగించిన టర్ఫ్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని వారు విమర్శించారు. మరోవైపు, ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల ధరల విషయంలో కూడా నిర్వాహకులు విమర్శలను ఎదుర్కొంటున్నారు. సాధారణ ఫైనల్ టికెట్ ధర 32,970 డాలర్లు (సుమారు రూ.31.50 లక్షలు)గా నిర్ణయించగా, ఆహారం, పానీయాల కోసం అదనంగా 1,600 డాలర్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. టికెట్ల ధరలు సామాన్య అభిమానులకు అందుబాటులో లేవంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.