LOADING...
FIFA : ప్రపంచకప్‌లో వెలుగులు నింపబోతున్న యువ తారలు
ప్రపంచకప్‌లో వెలుగులు నింపబోతున్న యువ తారలు

FIFA : ప్రపంచకప్‌లో వెలుగులు నింపబోతున్న యువ తారలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 10, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేర్లు మెస్సి, రొనాల్డో, నెయ్‌మార్‌. అలాగే మోద్రిచ్‌, నోయర్‌ వంటి అనుభవజ్ఞుల ప్రదర్శనలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈసారి టోర్నీలో తమ ప్రతిభతో మ్యాచ్‌ల గమనాన్ని మార్చగల యువ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతున్నారు. వీరికి ఇప్పుడే పెద్దగా గుర్తింపు లేకపోయినా, అసాధారణ నైపుణ్యాలతో ప్రపంచ వేదికపై తమ ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి యువ ప్రతిభావంతుల గురించి తెలుసుకుందాం.

వివరాలు

యమాల్‌పై భారీ అంచనాలు..

భవిష్యత్తు ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఆటగాడు లామిన్‌ యమాల్‌. స్పెయిన్‌కు చెందిన ఈ యువకుడు బార్సిలోనా తరఫున 2025-26 సీజన్‌లో 48 మ్యాచ్‌లు ఆడి 24 గోల్స్‌, 18 అసిస్ట్‌లు నమోదు చేశాడు. గత సీజన్‌లో బార్సిలోనా లా లిగా టైటిల్‌ గెలుచుకోవడంలో అతని పాత్ర అత్యంత కీలకం. బంతి అతని కాళ్ల వద్దకు వచ్చిన తర్వాత దాన్ని దక్కించుకోవడం ప్రత్యర్థులకు కష్టసాధ్యమే. అత్యధిక పారితోషికం పొందుతున్న వారిలో యమాల్‌ ఒకడు. అతని వార్షిక ఆదాయం సుమారు రూ.183 కోట్లుగా అంచనా. ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న యమాల్‌ తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడు. అందువల్ల ఉరుగ్వేతో జరిగే స్పెయిన్‌ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

వివరాలు

ఫ్రాన్స్‌ ఆశలు వారెన్‌పైనే..

ఫ్రాన్స్‌ జట్టు గురించి మాట్లాడితే సాధారణంగా ఎంబాపె పేరు ముందుగా వినిపిస్తుంది. కానీ ఈసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో యువ ఆటగాడు వారెన్‌ జైర్‌ ఎమెరీ. కేవలం 20 ఏళ్ల వయసున్న ఈ మిడ్‌ఫీల్డర్‌ ఇప్పటికే పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ) తరఫున 182 మ్యాచ్‌లు ఆడటం విశేషం. అతని వేగం, బంతిని ముందుకు తీసుకెళ్లే నైపుణ్యం, అలాగే రక్షణలో చూపించే సమర్థత జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 16 ఏళ్ల వయసులోనే పీఎస్‌జీ తరఫున అరంగేట్రం చేసిన వారెన్‌, 2023లో 17 ఏళ్లకే ఫ్రాన్స్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు ప్రపంచకప్‌ వేదికపై కూడా తన సామర్థ్యాన్ని నిరూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Advertisement

వివరాలు

బ్రెజిల్‌కు కొత్త ఆశాకిరణం..

ఫుట్‌బాల్‌ చరిత్రలో ఎన్నో దిగ్గజాలను అందించిన దేశం బ్రెజిల్‌. ప్రస్తుతం నెయ్‌మార్‌ జట్టులో ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ, యువ ఫార్వర్డ్‌ ఎండ్రిక్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 19 ఏళ్ల ఎండ్రిక్‌ రియల్‌ మాడ్రిడ్‌ తరఫున తన ప్రతిభను చాటుకున్నాడు. గోల్స్‌ సంఖ్య ఎక్కువగా లేకపోయినా, సహచరులకు అవకాశాలు సృష్టించడం, ఖచ్చితమైన ఫినిషింగ్‌తో ఆకట్టుకోవడం అతని ప్రత్యేకత. కోప్‌ డి ఫ్రాన్స్‌తో పాటు యూరోపియన్‌ పోటీల్లోనూ ఎండ్రిక్‌ మంచి ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో క్రొయేషియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో కేవలం 14 నిమిషాల వ్యవధిలోనే రెండు కీలక అసిస్ట్‌లు అందించి తన ప్రతిభను చాటుకున్నాడు.

Advertisement

వివరాలు

ఇంగ్లాండ్‌ యువ సంచలనం నికో రిలీ..

ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఇంగ్లాండ్‌ జట్టులో నికో రిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 21 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌కు కీలక ఆటగాడిగా ఎదిగాడు. ప్రిమియర్‌ లీగ్‌ ఫైనల్లో అర్సెనల్‌పై రెండు గోల్స్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 9 గోల్స్‌ చేయడంతో పాటు మరో 6 గోల్స్‌కు సహకరించాడు. అతని ప్రతిభను గుర్తించిన ఇంగ్లాండ్‌ ప్రధాన కోచ్‌ థామస్‌ టుచెల్‌, కోల్‌ పల్మర్‌, ఫిల్‌ ఫోడెన్‌ వంటి ప్రముఖ ఆటగాళ్లకు బదులుగా నికోకు ప్రపంచకప్‌ జట్టులో స్థానం కల్పించాడు. ప్రపంచ వేదికపై అతను ఎలా రాణిస్తాడో ఆసక్తికరంగా మారింది.

వివరాలు

సత్తాచాటనున్న మరికొందరు యువ ఆటగాళ్లు..

ప్రపంచకప్‌లో ప్రతిభ చాటేందుకు సిద్ధంగా ఉన్న ఇతర యువ ఆటగాళ్లలో జర్మనీకి చెందిన లెనార్ట్‌ కార్ల్‌ (18), ఐవరీ కోస్ట్‌కు చెందిన యాన్‌ డియోమాండే (18), స్పెయిన్‌కు చెందిన పా కబార్సి (19), ఫ్రాన్స్‌కు చెందిన డిజైర్‌ డౌయే (20), పోర్చుగల్‌కు చెందిన జావో నెవెస్‌ (21), తుర్కియేకు చెందిన అర్డా గులెర్‌ (21) ముఖ్యులు. వీరిలో జావో నెవెస్‌ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఆటగాడు. పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ వరుసగా రెండు సార్లు ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఈసారి పోర్చుగల్‌ తరఫున రొనాల్డోతో కలిసి అతను చూపించే ఆటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement