వరల్డ్ కప్ క్వాలిఫయర్ వేదికలో అగ్నిప్రమాదం.. మ్యాచులపై ఐసీసీ కీలక నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచులు జింబాబ్వే వేదికగా జరుగుతున్నాయి. ఈ మ్యాచులను హరారే స్పోర్ట్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లలో ఐసీసీ నిర్వహిస్తోంది. కాగా మంగళవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జింబాబ్వే, నెదర్లాండ్స్ మ్యాచ్ ముగిసిన ఆరు గంటల తర్వాత మైదానంలోని సౌత్ వెస్ట్ గ్రాండ్ స్టాండ్ లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన సమయంలో కాజిల్ కార్నర్‌లో పైకప్పు భాగంలో ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. వెంటనే గుర్తించిన మైదానం సిబ్బంది ఫైర్ సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
షెడ్యూల్ ప్రకారమే మ్యాచులు
హారారే స్పోర్ట్స్ క్లబ్ లో వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్న సమయంలో ఐసీసీ సెక్యూరిటీ టీమ్, జింబాబ్వే క్రికెట్ బోర్డు మైదానంలో ప్రత్యేక ఇన్స్ పెక్షన్ నిర్వహించాయి. ఒకవైపు స్టాండ్ కు మంటలు వ్యాపించడంతో పెద్ద నష్టం వాటిల్లలేదు. దీంతో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మ్యాచులు జరగనున్నాయి. ఇంకా ఈ మైదానంలో నాలుగు సూపర్ సిక్స్ గేమ్స్‌తో పాటు మూడు గ్రూప్ మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే జులై 9న క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో తలపడే రెండు జట్లు మాత్రమే వన్డే వరల్డ్ కప్ అర్హత సాధించనున్నాయి.