Teamindia: అయ్యో..! ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం.. చెత్త రికార్డులివే
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఘోర పరాజయం పాలైన టీమిండియా పలు అవాంఛిత రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమి తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా భారత టీ20 చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ నమోదు కాని కొన్ని ప్రతికూల రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
వివరాలు
టీ20ల్లో అతి తక్కువ ఓవర్లు మాత్రమే బ్యాటింగ్..
ఈ మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 11.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఇంత తక్కువ ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. గతంలో 2015లో కటక్‌లో దక్షిణాఫ్రికాపై 17.2 ఓవర్లలో, 2008లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై 17.3 ఓవర్లలో ఆలౌట్ అయిన రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ అధిగమిస్తూ శ్రేయస్ నేతృత్వంలోని జట్టు కొత్త చెత్త రికార్డును నమోదు చేసింది. అలాగే 15 ఓవర్లు పూర్తి కాకముందే భారత్ ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి.
వివరాలు
పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయిన తొలి సందర్భం..
టీ20 చరిత్రలో తొలి ఆరు ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోవడం భారత జట్టుకు ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 52 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇంతకుముందు తొలి ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన సందర్భాలు 13 ఉన్నప్పటికీ, ఐదు వికెట్లు పడిపోవడం ఎప్పుడూ జరగలేదు. 2026లో ప్రపంచకప్ సందర్భంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి, ఐర్లాండ్ పర్యటనలో రెండో టీ20లో మరోసారి తొలి ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది.
వివరాలు
రెండో అత్యల్ప స్కోరుతో ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో భారత్ 76 పరుగులకే కుప్పకూలింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు నమోదు చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే. అంతకుముందు 2008లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడిన విదేశీ జట్లలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో చేసిన 76 పరుగులతో ఆ అవాంఛిత రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకుముందు 2005లో సౌతాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా 79 పరుగులకు ఆలౌట్ కావడం రికార్డుగా ఉండేది.
వివరాలు
పరుగుల తేడాతోనే అతిపెద్ద ఓటమి..
ఈ మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్, టీ20 చరిత్రలో తన అత్యంత భారీ పరాజయాన్ని నమోదు చేసింది. వందకు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు ఇదే తొలి అనుభవం. గతంలో 2019లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన 80 పరుగుల పరాజయం ఇప్పటి వరకు అతిపెద్ద ఓటమిగా ఉండగా, ఇప్పుడు అది రెండో స్థానానికి చేరింది. అలాగే 2026లో దక్షిణాఫ్రికాతో 76 పరుగుల తేడాతో, 2025లో మరోసారి దక్షిణాఫ్రికాతో 51 పరుగుల తేడాతో, 2026లో న్యూజిలాండ్‌తో 50 పరుగుల తేడాతో ఎదురైన పరాజయాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వివరాలు
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయానికి దూరం..
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకోలేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో పరాజయం చవిచూడగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాన్ని నమోదు చేయలేని భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అవాంఛిత రికార్డును మూటగట్టుకున్నాడు. గతంలో 2021, 2009 సంవత్సరాల్లో మాత్రమే భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలవకుండా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించింది.