Page Loader
Suryakumar Yadav: ఫిట్‌నెస్‌పై ఫోకస్.. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్
ఫిట్‌నెస్‌పై ఫోకస్.. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav: ఫిట్‌నెస్‌పై ఫోకస్.. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నారు. కుడివైపు కడుపు దిగువ భాగంలో తలెత్తిన ఈ ఆరోగ్య సమస్యతో ఇటీవల ఆయన అసౌకర్యానికి లోనవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సూర్య లండన్‌కి చేరుకుని అక్కడి ప్రత్యేక వైద్య నిపుణుడిని సంప్రదించారు. ప్రాథమికంగా మెడికల్ టెస్టులు నిర్వహించగా, అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చని తెలుస్తోంది. ఇటీవలి ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సూర్య, మొత్తం 700 పరుగులు చేసి తన ఫామ్‌ను మరోసారి రుజువు చేశారు. ఆ తర్వాత జరిగిన ముంబై టీ20 లీగ్‌లోనూ పాల్గొని క్రికెట్‌తో బిజీగానే గడిపారు.

Details

ఆగస్టులో బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్

ప్రస్తుతం భారత జట్టుకు అంతర్జాతీయ టీ20 షెడ్యూల్ లేని నేపథ్యంలో తన ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకునేందుకు ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. బీసీసీఐ వర్గాల ప్రకారం, శస్త్రచికిత్స అవసరమైతే ఆయన కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సర్జరీ అనంతరం సూర్య బెంగళూరులోని బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీలోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో రికవరీ, ఫిట్‌నెస్ ట్రైనింగ్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక జూన్ 20న ఇంగ్లాండ్‌లో మొదలయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు భారత టెస్ట్ జట్టు సిద్ధమవుతున్నప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో సూర్యకుమార్ సెట్ కాకపోవడంతో, ఈ వ్యవధిని ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించుకునే అవకాశం దక్కింది. ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని అభిమానులు అశిస్తున్నారు.