LOADING...
Jennifer Pace: భారత బాస్కెట్‌బాల్ మాజీ కెప్టెన్ జెన్నిఫర్ పేస్ ఇకలేరు
భారత బాస్కెట్‌బాల్ మాజీ కెప్టెన్ జెన్నిఫర్ పేస్ ఇకలేరు

Jennifer Pace: భారత బాస్కెట్‌బాల్ మాజీ కెప్టెన్ జెన్నిఫర్ పేస్ ఇకలేరు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి, భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ జెన్నిఫర్ పేస్ (72)కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం రాత్రి కోల్‌కతాలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. జెన్నిఫర్ పేస్ కేవలం క్రీడాకారిణిగానే కాకుండా భారత బాస్కెట్‌బాల్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. 1972లో జరిగిన 1972 సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె.. అనంతరం 1982లో భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్‌కు ఆమె ముని మనుమరాలు కావడం విశేషం.

వివరాలు

టెన్నిస్ ప్రపంచంలో అద్భుత విజయాలు

పేస్ కుటుంబానికి క్రీడలతో ఎంతో సన్నిహిత అనుబంధం ఉంది. జెన్నిఫర్ భర్త, దివంగత డాక్టర్ వెస్ పేస్ భారత హాకీ జట్టు సభ్యుడిగా 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గతేడాది ఆగస్టులో మరణించారు. ఏడాది గడవకముందే జెన్నిఫర్ కూడా కన్నుమూయడంతో పేస్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రుల స్ఫూర్తితోనే లియాండర్ పేస్ టెన్నిస్ ప్రపంచంలో అద్భుత విజయాలు సాధించారు.

వివరాలు

పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం

తన కెరీర్‌లో మొత్తం 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న ఆయన.. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారత కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ విజయంతో తన తండ్రి ఒలింపిక్ వారసత్వాన్ని కూడా కొనసాగించారు. జెన్నిఫర్ పేస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువెందు అధికారి, పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement