Gurnoor brar: గుర్నూర్.. గేమ్ చేంజర్!
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకంగా మారే అవకాశం ఉందని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ తన వేగంతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రార్.. బుమ్రా అందుబాటులో లేకపోవడంతో లంకతో టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైంది.
వివరాలు
ఫైనల్‌కు చేరాలంటే అలా చేయాల్సిందే..
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలంటే శ్రీలంకపై మంచి ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో మహరూఫ్ మాట్లాడుతూ బుమ్రా లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటని పేర్కొన్నాడు.
"బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు.
ముఖ్యంగా పాత బంతితో మరింత ప్రమాదకరంగా మారతాడు. అయితే గాయం కారణంగా ఈ సిరీస్‌కు అతడు అందుబాటులో లేడు.
ఇది భారత జట్టుకు చాలా పెద్ద లోటు. మహమ్మద్ సిరాజ్ మంచి బౌలరే. కానీ బుమ్రాతో పోలిస్తే ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది" అని మహరూఫ్ చెప్పాడు.
పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో గుర్నూర్ బ్రార్‌కు అవకాశం దక్కొచ్చని మహరూఫ్ అభిప్రాయపడ్డాడు.
వివరాలు
పంత్‌కు అరగంట చాలు..
ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం, వాషింగ్టన్ సుందర్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్‌ను ఆడించే అవకాశం ఉందని మహరూఫ్ చెప్పాడు.
"రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్‌కు అవకాశం దక్కొచ్చు.
గాలె పిచ్ కుల్దీప్‌కు బాగా అనుకూలిస్తుంది. ఇక్కడి పిచ్‌లు కేవలం స్పిన్‌కు మాత్రమే సహకరించవు.
కొంత బౌన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మానవ్ సుతార్‌కు ఉపయోగపడొచ్చు.
రెండు జట్లు కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది" అని మహరూఫ్ వివరించాడు.