ICC: ఐపీఎల్ నుంచి యూరోపియన్ లీగ్ వరకు.. ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఐసీసీ నిఘా!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల హవా కొనసాగుతోంది. ఐపీఎల్‌తో పాటు ఎస్‌ఏ20, ఐఎల్‌టీ20, బిగ్ బాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్లు అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో కీలక స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటికి తోడు ఈ ఏడాది చివర్లో యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కానుండటంతో ఫ్రాంచైజీ క్రికెట్ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
ఐసీసీ కీలక నిర్ణయం
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ వ్యవస్థకు భంగం కలగకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌ను ఎలా సమన్వయం చేయాలనే అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోదం తెలిపింది. దేశీయ టీ20 లీగ్‌ల విస్తరణ వల్ల ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. "ఫ్రాంచైజీ క్రికెట్ వేగంగా విస్తరిస్తుండటంపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌తో ఫ్రాంచైజీ టోర్నమెంట్లను సమన్వయం చేసే మార్గాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ పరిరక్షణే లక్ష్యం
ఫ్రాంచైజీ లీగ్‌లకు పెరుగుతున్న ఆదరణను గుర్తిస్తూనే, అంతర్జాతీయ క్రికెట్ ప్రాధాన్యతను కాపాడేందుకు అవసరమైన యంత్రాంగాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. ముఖ్యంగా ఆటగాళ్ల లభ్యత, జాతీయ జట్ల బాధ్యతలు, ఫ్రాంచైజీ లీగ్‌ల మధ్య సమతుల్యత సాధించడంపై దృష్టి సారించనుంది. లీగ్‌ల సంఖ్యపై పరిమితుల ఆలోచన ఒక ఆటగాడు సీజన్‌లో పాల్గొనే ఫ్రాంచైజీ లీగ్‌ల సంఖ్యపై పరిమితి విధించాలనే ప్రతిపాదనలపై గతంలోనూ ఐసీసీ కమిటీల్లో చర్చలు జరిగాయి. అంతర్జాతీయ బాధ్యతలకు ప్రాధాన్యం కొనసాగుతూనే, ఫ్రాంచైజీ క్రికెట్‌కు అవకాశం కల్పించే విధానాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
వివరాలు
చిన్న దేశాల క్రికెట్‌కు సవాళ్లు
ఫ్రాంచైజీ క్రికెట్ విస్తరణ ప్రభావం ముఖ్యంగా చిన్న క్రికెట్ దేశాలపై ఎక్కువగా కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కంటే ఫ్రాంచైజీ టోర్నమెంట్లు ఆర్థికంగా లాభదాయకంగా ఉండటంతో పలువురు ఆటగాళ్లు జాతీయ జట్ల కంటే లీగ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ 30 ఏళ్లు నిండకముందే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా జాతీయ జట్టు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ సునీల్ నరైన్ సైతం తన కెరీర్‌లో ఎక్కువ కాలం ఫ్రాంచైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే.
వివరాలు
కొత్త లీగ్‌లతో పెరుగుతున్న ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా కొత్త టీ20 లీగ్‌లు పుట్టుకొస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న టోర్నమెంట్లు కూడా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియంత్రణ లేకుండా ఫ్రాంచైజీ క్యాలెండర్ విస్తరిస్తే ద్వైపాక్షిక క్రికెట్ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని ఐసీసీ భావిస్తోంది. అలాగే FTP కింద అంతర్జాతీయ సిరీస్‌ల షెడ్యూలింగ్ కూడా మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వివరాలు
భారత్ మాత్రం ప్రత్యేకం
అయితే ఈ విషయంలో భారత్ మినహాయింపుగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ కాంట్రాక్ట్ పొందిన ఫస్ట్-క్లాస్ క్రికెటర్లను విదేశీ టీ20 లీగ్‌లలో పాల్గొనకుండా నిషేధిస్తోంది. దీంతో భారత ఆటగాళ్లు ప్రధానంగా దేశీయ క్రికెట్, అంతర్జాతీయ బాధ్యతలకే పరిమితమవుతున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తును కాపాడేందుకు ఐసీసీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.