Virat Kohli: ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకూ.. 2026లో కోహ్లీ ముందు ఉన్న మూడు భారీ రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు ముద్దాడాడు. అదే ఏడాది భారత జట్టుతో కలిసి చాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుని కెరీర్‌లో మరో కీలక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నానని మరోసారి చాటి చెప్పాడు. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో విరాట్ కోహ్లీ ముందర మూడు కీలక మైలురాళ్లు సవాలుగా నిలవనున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిస్తే...
Details
ఐపీఎల్‌లో 9,000 పరుగుల మైలురాయి
ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలవడానికి 2026 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీకి కేవలం 339 పరుగులే అవసరం. ప్రస్తుతం అతను 259 ఇన్నింగ్స్‌ల్లో 8,661 పరుగులు సాధించాడు. ఐపీఎల్ ఆల్‌టైమ్ టాప్ స్కోరర్‌గా కోహ్లీనే కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌ల్లో 7,046 పరుగులు మాత్రమే చేశాడు. ప్రత్యేకత ఏంటంటే, కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ మొత్తం ఒకే జట్టు ఆర్సీబీ తరఫునే ఆడాడు. అలాగే గత మూడు ఐపీఎల్ సీజన్‌ల్లో ఒక్క సీజన్‌లోనూ 600 పరుగుల కంటే తక్కువ చేయకపోవడం అతని స్థిరత్వానికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది.
Details
వన్డేల్లో 15,000 పరుగుల అరుదైన ఘనత
వన్డే క్రికెట్‌లో మరో చారిత్రక రికార్డు కోహ్లీకి అందుబాటులో ఉంది. వన్డేల్లో 15,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా మారే అవకాశాన్ని అతను అందిపుచ్చుకునే దిశగా ఉన్నాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18,426 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 296 ఇన్నింగ్స్‌ల్లో 14,557 పరుగులతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 15,000 పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే అతనికి ఇంకా 443 పరుగులు మాత్రమే అవసరం.
Details
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు
టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం కూడా 2026లోనే కోహ్లీకి ఉంది. ప్రస్తుతం అతను 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు సాధించాడు. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర చేసిన 28,016 పరుగుల రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి కేవలం 42 పరుగులే కావాలి. 2026లో న్యూజిలాండ్‌తో జరిగే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉండటంతో, ఆ మ్యాచ్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.