Vishal Nishad: పేదరికం నుంచి ఐపీఎల్ వరకు.. కూలీ తనయుడి స్ఫూర్తిదాయక ప్రయాణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జంగల్ అయోధ్య ప్రసాద్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల విశాల్ పేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన కుర్రాడు. నలుగురు పిల్లల్లో అతడే చిన్నవాడు. తండ్రి ఉమేశ్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. విశాల్‌కు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించిన తండ్రి అతడిని ప్రోత్సహించడంతో, కూలీ పనికి వెళ్తూనే మరోవైపు క్రికెటర్‌గా ఎదగడానికి విశాల్ కృషి చేశాడు. తన గ్రామం నుంచి సుమారు 20కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరఖ్‌పూర్‌కు వెళ్లి క్రికెట్ ఆడేవాడు. అతడి పట్టుదల, కష్టాన్ని గమనించిన కోచ్ కల్యాణ్ సింగ్ విశాల్‌కు తన సంస్కృతి క్రికెట్ అకాడమీలో ఉచితంగా శిక్షణ అందించారు. స్పిన్ బౌలింగ్‌పై పట్టు సాధించిన విశాల్ స్థానిక టోర్నీల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుకున్నాడు.
Details
నాలుగు మ్యాచులో ఎనిమిది వికెట్లు
అనంతరం కాన్పూర్ క్రికెట్ అకాడమీలో అవకాశం దక్కడంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆట మరింత మెరుగైంది. 2024 యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఈ టోర్నీలో గోరఖ్‌పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన విశాల్, ఒక మ్యాచ్‌లో నితీశ్ రాణాను ఔట్ చేయడం విశేషం. ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తుందని విశాల్ ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే అతడికి ఇప్పటివరకు ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం కూడా లేదు. అయినప్పటికీ ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడంతో వేలంలో చోటు సంపాదించాడు.
Details
వచ్చే ఏడాది ఐపీఎల్ బరిలోకి దిగే అవకాశం
అతడిపై పంజాబ్ కింగ్స్ నమ్మకం ఉంచడంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో బరిలో దిగే అవకాశం దక్కింది. విశాల్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న కోచ్ కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. "కొన్నేళ్ల క్రితం గోరఖ్‌పూర్‌లో కొంతమంది పిల్లలు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండగా, వారిలో ఒక కుర్రాడు బంతిని అద్భుతంగా లెగ్ స్పిన్ చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. వెంటనే 'నా అకాడమీకి వస్తావా?' అని అడిగాను. అతడు ఎంతో ఆనందంగా ఒప్పుకున్నాడు. అక్కడి నుంచే విశాల్ ప్రయాణం ప్రారంభమైంది" అని తెలిపారు.