Amol Muzumdar : రంజీ స్టార్ క్రికెటర్ నుంచి మహిళా జట్టు కోచ్ వరకు.. అమోల్ మజుందార్ అద్భుత ప్రయాణ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు ఒకే గురువు రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన ఆటగాడు, దేశీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టించినా జాతీయ జట్టుకు మాత్రం ప్రాతినిధ్యం వహించలేకపోయిన ఆ వ్యక్తి ఎవరంటే అమోల్ మజుందార్. ఒకప్పుడు 'నెక్స్ట్ టెండూల్కర్'గా పేరొందిన ఈ ముంబై మాజీ కెప్టెన్, ఇప్పుడు తన అనుభవాన్ని భారత మహిళా క్రికెట్ జట్టుకు అందిస్తున్నారు. 2023 అక్టోబరులో భారత మహిళా జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నాయకత్వంలోనే భారత్ ఇటీవల ప్రపంచకప్ సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
Details
2023లో భారత మహిళా జట్టు హెడ్ కోచ్ గా నియామకం
అమోల్ అనిల్ మజుందార్ దేశీయ క్రికెట్ చరిత్రలో అత్యంత స్థిరమైన, విశ్వసనీయమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరుగా నిలిచారు. ఆయన రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డుదారుడుగా నిలిచారు. 1993-94 సీజన్‌లో బాంబే తరపున హర్యానాపై జరిగిన తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లోనే 260 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలతో కలిసి ఇండియా 'ఎ' తరపున ఆడినా, ఆయనకు సీనియర్ జాతీయ జట్టులో చోటు లభించలేదు. అయితే, బీసీసీఐ 2023లో ఆయన ప్రతిభను గుర్తించి భారత మహిళా జట్టు హెడ్ కోచ్‌గా నియమించింది. సచిన్ టెండూల్కర్‌తో అమోల్ మజుందార్ అనుబంధం ఆయన కెరీర్ ప్రారంభం నుంచే ఉంది.
Details
అండర్ 19 జట్టుకు వైస్ కెప్టన్
గురువు రమాకాంత్ అచ్రేకర్ సూచనతో ఆయన శారదాశ్రమ్ విద్యామందిర్ పాఠశాలకు మారగా, అక్కడే టెండూల్కర్‌ను కలిశారు. ఆ దశలోనే ఆయన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. 1994లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టుకు ఆయన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. మజుందార్ తన క్రికెట్ జీవితం ఎక్కువగా ముంబై క్రికెట్‌కే అంకితం చేశారు. 2006-07 సీజన్‌లో ముంబైకి నాయకత్వం వహించి రంజీ ట్రోఫీ టైటిల్ అందించారు. అశోక్ మంకడ్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును కూడా ఆయన అధిగమించారు. అనంతరం అస్సాం (2009) మరియు ఆంధ్రప్రదేశ్ (2012) జట్ల తరపున ఆడారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. రిటైర్మెంట్ అనంతరం మజుందార్ కోచింగ్ రంగంలో ప్రవేశించారు.
Details
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ గా పనిచేసిన అనుభవం
భారత అండర్-19, అండర్-23 జట్లకు బ్యాటింగ్ కోచ్‌గా, నెదర్లాండ్స్ జట్టుకు కన్సల్టెంట్‌గా, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. సౌతాఫ్రికా జట్టు భారత పర్యటన సందర్భంగా తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. తర్వాత ముంబై సీనియర్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించారు. 2023 అక్టోబరులో భారత మహిళా జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితులైన తర్వాత మజుందార్ తన వ్యూహాత్మక దృష్టితో, ఆటగాళ్లపై నమ్మకంతో జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయన మార్గదర్శకత్వంలో జట్టు ప్రపంచ వేదికపై అద్భుత విజయాలను సాధిస్తోంది. తన అనుభవం, శిక్షణా నైపుణ్యంతో భారత క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.