Gautam Gambhir: గంభీర్‌పై ఫేక్ కంటెంట్… కోర్టులో పిటిషన్
ఈ వార్తాకథనం ఏంటి
గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న ఆయన, తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ కంటెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో గంభీర్ మాట్లాడుతూ.. తన పేరు, ఫోటో, వాయిస్ అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఫేక్ కంటెంట్ ప్రచారం అవుతోందన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికల్లో తాను మాట్లాడినది తీసుకుని వీడియోలు చేస్తున్నారని మండిపడ్డారు. 2025 నుంచి తనపై ఈ విధమైన ఫేక్ కంటెంట్ పెరిగిపోయిందన్నారు. తన తరఫు న్యాయవాదులు కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు.
వివరాలు
ఆందోళన చెందిన గౌతమ్ గంభీర్
కొన్ని వీడియోలు లక్షల సంఖ్యలో వ్యూస్ సాధించడంతో ప్రజల్లో అపార్థాలు, గందరగోళం పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం పదహారు మందిపై కేసు నమోదు చేసిన గంభీర్, తన వ్యక్తిత్వ హక్కులను రక్షించాలని కోర్టును అభ్యర్థించారు. అదేవిధంగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నష్టపరిహారం కోరడమే కాకుండా, నకిలీ కంటెంట్‌ను వెంటనే తొలగించాలన్నారు. భవిష్యత్తులో తన పేరు, ముఖం, వాయిస్ అనుమతి లేకుండా వినియోగించకుండా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు.