Gautam Gambhir: ఎర్రకోట పేలుడు ఘటనపై గౌతమ్ గంభీర్ దిగ్భ్రాంతి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు దేశాన్ని కుదిపేసింది. కారులో జరిగిన ఈ భయంకర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై టీమిండియా కోచ్, ఈస్ట్ దిల్లీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలో జరిగిన పేలుడు కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు, 2019 నుంచి 2024 వరకు ఈస్ట్ దిల్లీ నుండి లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.
Details
దేశ వ్యాప్తంగా భద్రతా చర్యలు ముమ్మరం
ఇక దిల్లీ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు మరింత బలపడ్డాయి. ముఖ్యంగా కోల్‌కతాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉంది. నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్-సఫారీ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌గార్డెన్స్ మైదానం, హోటళ్ల పరిసరాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత జట్టు, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బస చేసే హోటళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ ఈరోజు (మంగళవారం) ఈడెన్ గార్డెన్స్‌ను స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB)అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా సమీక్షా సమావేశం జరగనుంది.